ఏపీలో శుక్రవారం ఒక్కరోజే గ్రామ సభలు నిర్వహించనున్నారు. వాస్తవానికి వారం రోజుల పాటు గ్రామ సభ లు నిర్వహించాలని ముందుగానే అనుకున్నారు. కానీ, కొన్ని కారణాలతో సభలను ఒక్కరోజుకే పరిమితం చేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగే ఈ సభల వెనుక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముద్ర ఉంది. ఆయన ఏరికోరి ఈ సభలను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి సుమారు 10 ఏళ్ల కిందట మాత్రమే గ్రామ సభలు నిర్వహించారు. ఆ తర్వాత.. వాటి జాడ ఎక్కడా కనిపించలేదు.
దీనికి కారణం.. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలకు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి-కేంద్ర పథకాలకు మధ్య సంబంధం ఉండడమే. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధుల్లో కొంత తమ వాటా కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయాలి. కానీ, గత కొన్నేళ్లుగా ఇలా చేయడం లేదు. పైగా.. గ్రామీణ అభివృద్దికి ఇచ్చిన సొమ్మును కూడా.. వివిధ రూపాల్లో వేరే కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
“గ్రామాలకు మనం ఇవ్వాల్సింది పోయి.. మనమే వారి సొమ్మును లాగేసుకుంటున్నాం. ఇది చాలా దారుణం” అని వ్యాఖ్యానించారు. అయితే.. ఇక్కడ పవన్ ఆవేదనలో వాస్తవం ఉన్నా.. క్షేత్రస్థాయిలోకి వచ్చే సరికి.. మాత్రం దీనిని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఏ ప్రభుత్వమూ లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇలానే ఉంది. ఇప్పుడు.. దీనిని సరిదిద్ది.. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను నేరుగా గ్రామాలకు ఇచ్చేయాలన్నది పవన్ సూచన. దీనికి రాష్ట్ర వాటా కూడా కలపాలన్నది ఆయన భావన.
కానీ, ఈ రెండు చేయడం అంత ఈజీకాదు. పోనీ.. రెండోది చేయలేకపోయినా.. మొదటిది అయినా.. చేస్తారా? అంటే.. దీనికి ఎంతో కృత నిశ్చయం కావాలి. ఎందుకంటే.. ప్రభుత్వాలు తమ శక్తికి మించిన భారాలను నెత్తిన పెట్టుకున్నప్పుడు.. ఎటు నుంచి నిధులు వచ్చినా.. వాడేయడం తప్ప.. నిర్దేశిత కార్యక్రమానికి ఇవ్వాలన్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చి.. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల నిధులను వాటికే ఇస్తే.. పవన్ ముద్ర పడినట్టే. కానీ, అలా జరుగుతుందా? అనేది చూడాలి.
ఇక, ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి కీలక నిర్ణయాలు అమలు చేయాలన్నది పవన్ భావన. ఉపాధి పనులను పెద్ద ఎత్తున పెంచి.. సోషల్ ఆడిటింగ్ చేయించాలన్నది ఆయన ఉద్దేశం. కానీ, ఇది కూడా అంత ఈజీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలకు బలంగా ఉన్న నాయకులకు ఉపాధి హామీ పథకం ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. తమవారి పేర్లను జోడించి.. వారు పనిచేసినా.. చేయకపోయినా.. డబ్బులు తీసుకుని దానిలో కొంత కమీషన్ జేబులో వేసుకుంటూ.. పార్టీలనేతలు కాలం వెళ్లదీస్తున్నారు. దీనిలో ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడాలేదు.
ఇప్పుడు వారి అక్రమార్జనకు బ్రేకులు వేయాలన్న పవన్ నిర్ణయం ఏమేరకు సాకారం అవుతుందనేది చూడాలి. కానీ, ఇది కూడా అంత ఈజీకాదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండాలంటే.. నాయకులను చూసీ చూడనట్టు వదిలేయాలన్న భావన పార్టీల్లోనే ఉంది. సో.. పవన్ ఆదర్శాలు బాగానే ఉన్నా.. ఫలితాలు.. దానికి తగినట్టు వచ్చేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు. అందుకే.. మొదట్లోనే ఆయన ఆలోచనలకు బ్రేక్ పడుతూ.. ఏడు రోజులు కాస్తా.. ఒక్కరోజుకు వచ్చింది.