ఏపీలోని మైనారిటీలను ఓన్ చేసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్న విష యం తెలిసిందే. ఇది కొన్నికొన్ని సార్లు సక్సెస్ అవుతున్నా.. మరికొన్ని సార్లు బెడిసి కొడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తమతో పొత్తులు పెట్టుకోవాలని జగన్‌ను కోరిన విషయం వాస్తవం. అయితే.. మైనారిటీ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకున్న జగన్ పొత్తులు వద్దని.. ఎవరికి వారు పోటీ చేద్దామని చెప్పారు. దీంతో బీజేపీ.. టీడీపీతో చెలిమి చేసింది.
అయితే.. జగన్ తీసుకున్న నిర్ణయంలో వాస్తవం ఎంత? అనేది చూస్తే.. నేతిబీరలో నెయ్యిని తలపిస్తుంది. పైకి ఏపీ వరకు బీజేపీతో ఆయన అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నా.. అంతర్గతంగా చూస్తే.. కేంద్రంలో మాత్రం బీజేపీతో ఆయన చెలిమి చేశారు. గత ఐదేళ్ల అధికారంలో ఆయన బీజేపీ చెప్పిందే చేశారు. పార్లమెంటులో అనేక చట్టాలకు మద్దతు కూడా తెలిపారు. ట్రిపుల్ తలాక్, జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని హరించే 370 ఆర్టికల్ రద్దుకు కూడా మద్దతు ఇచ్చారు.
వాస్తవానికి వీటిని మైనారిటీ ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో జగన్‌ను కలిసి.. మద్దతు ఇవ్వ ద్దని కూడా అభ్యర్థించారు. దీనిని ఆయన తలూపారు. కానీ, తెరచాటున చేయాల్సింది చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు మరో విషయం తెరమీదికి వచ్చింది. అదే.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. మైనారిటీ ముస్లింలకు చెందిన వక్ఫ్ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ భూములను వెనక్కి తీసుకోవాలని మోడీ సర్కారు ప్రతిపాదించింది.
దీనిని మైనారిటీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ భూములను తమకు దక్కకుండా చేసే ప్రయ త్నం చేస్తున్నారని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే జగన్ తో భేటీ అయిన.. ఏపీ ముస్లిం సంఘాలు.. కొత్త వక్ఫ్ బిల్లు వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందన్నారు. ఆ బిల్లును వైసీపీ వ్యతిరేకించాలని కోరారు. దీనికి జగన్ “ఔను వ్యతిరేకించాలి. వ్యతిరేకిస్తాం కూడా“ అని చెప్పారు. దీనిని మైనారిటీ వర్గాలు స్వాగతించాయి. కానీ, ఇక్కడ వ్యతిరేకించిన అనేక విషయాల్లో జగన్.. ఢిల్లీలో మాత్రం సహకరించిన విషయాన్ని కొందరు మైనారిటీ ముస్లింలు గుర్తు చేస్తున్నారు.
జగన్‌ను నమ్మేదెలా? అనేది వారి ప్రశ్న. ఎందుకంటే.. తనపై ఉన్న కేసులు కావొచ్చు.. ఇప్పుడున్న అత్యంత బలహీన పరిస్థితి కావొచ్చు.. ఏదేమైనా కేంద్రంతో పేచీలు పెట్టుకునే పరిస్థితి అయితే లేదు. దీంతో మైనారిటీలకు ఎప్పటికప్పుడు హామీలు ఇవ్వడం.. వాటిని ఢిల్లీలో బుట్టదాఖలు చేయడం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మైనారిటీలు జగన్‌ను నమ్మే విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం.