రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనలు, కొత్త పథకాలు, కొత్త అంశాలతో ముందుకు సాగుతుందని అందరు భావిస్తారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నాయకుల అభిప్రాయాల మేరకు 2014-2019 మధ్య సాగిన పరిపాలన మళ్లీ తీసుకురావాలనేది ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.
అప్పట్లో అనుసరించిన విధానాల్ని ఇప్పుడు కొనసాగించాలని చూస్తున్నారు. ఒకటి రెండు శాఖల్లో తప్ప దాదాపు మిగిలిన అన్ని శాఖల్లో కూడా గత పాలనలో తీసుకున్న నిర్ణయాలను, గతంలో ఇచ్చిన ఆదేశాలను అనుసరించేలా వ్యవహరించాలని పెద్ద ఎత్తున జరుగుతున్న అంశమని తిరుపతి వర్గాలే చెబుతున్నాయి. అప్పట్లో మద్యం విధానం కావచ్చు, ఉద్యోగ వ్యవస్థ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఉద్యోగ ఉపాధి కల్పన కావచ్చు.
ఏ రంగాన్ని తీసుకున్నా చంద్రబాబు వ్యూత్మకంగా వ్యవహరించారు. అదేవిధంగా నాయకులను కూడా నడిపించారు. ఇప్పుడు కూడా అదే విధానం అనుసరించాలని క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి ఒత్తిడులు పెరుగుతున్నాయి. దీంతో మద్యం సహా పాఠశాలలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల విషయంలో 2014 నుంచి 2019 మధ్య వ్యవహరించిన తీరుతోనే ఇప్పుడు కూడా నడవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
దీనికి తోడు సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలను కూడా తిరిగి ప్రవేశపెడుతున్నారు. ఇవన్నీ తమకు మేలు చేస్తాయి అన్నది చంద్రబాబు సహా పార్టీ నాయకుల ఆలోచన. మరి ప్రజలు దీనిని స్వాగతిస్తారా? ఒకవేళ పాత పథకాలను పెట్టినా కూడా తమ్ముళ్ళ దూకుడును తగ్గించకపోతే వ్యతిరేకతను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని ఎలా చేస్తారన్నది చూడాలి.