ఎన్డీఏకు హ్యాండిచ్చిన అకాలీదళ్ … వైసిపి జాయినవుతుందా?

కేంద్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఇంతకాలం నమ్మకమైన భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చేసింది. వారం రోజుల క్రితం అకాలీదళ్ ఎంపి హరిసిమ్రత్ కౌర్ తన మంత్రిపదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లుకు నిరసనగానే ఆమె కేంద్రమంత్రిగా రాజీనామా చేశారు.

అప్పటి నుండి ఎన్డీఏలో అకాలీదళ్ ఎంతకాలం కంటిన్యు అవుతుందనే విషయంపై ఊహాగానాలు మొదలైపోయాయి. సంస్కరణల బిల్లుపై కేంద్రం గట్టిగా ముందుకెళుతుండటంతో దేశవ్యాప్తంగా రైతాంగం నుండి వ్యతిరేకత కూడా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే పంజాబ్ లో రైతుల ఆందోళన రోజురోజుకు పెరిగిపోతోంది.

రైతుల పక్షాన నిలబడేందుకున్నట్లుగా చివరకు పార్టీ ఎన్డీఏలో నుండి కూడా బయటకు వచ్చేసింది. మొదటి నుండి పంజాబ్ వ్యవసాయ, వ్యవసాయాధారిత పరిశ్రమలకు పెట్టింది పేరు. కాబట్టి రైతాంగాన్ని దూరం చేసుకునేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించదు. ఇందులో భాగంగానే రైతాగ్రహాన్ని తట్టుకునేందుకు కేంద్ రప్రభుత్వంలో నుండి అకాలీదళ్ బయటకు వచ్చేసిందనే చెప్పాలి.

ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన అకాలీదళ్ మూడో పార్టీ. దీని కన్నా ముందు ఆర్ఎల్ఎస్పీ, శివసేన పార్టీలు బయటకు వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. బీహార్ లో లోక్ తాంత్రిక జన్ పార్టీ (ఎల్జేపి) కూడా దాదాపు ఇదే పరిస్ధితిలో ఉంది. కేంద్రంలో పార్టీ పరిస్దితి ఎన్డీఏలో బాగానే ఉన్నా బీహార్ లో మాత్రం ప్రతిరోజు గొడవలుగానే ఉంది. తొందరలో జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు మిత్రపక్ష పార్టీ ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కు ఏమాత్రం పడటం లేదు. 243 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 147 సీట్లలో పోటి చేయటానికి చిరాగ్ రెడీ అయిపోతున్నారు. ఇక్కడే నితీష్-చిరాగ్ మద్య గొడవలు పెరిగిపోతున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే అకాలీదళ్ ద్వారా ఏర్పడిని ఖాళీని వైసిపి భర్తీ చేస్తుందా అనే ప్రచారం పెరిగోపోతోంది. మొన్నటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ లో హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటి అయిన విషయం తెలిసిందే. ఈ భేటిలో వైసిపిని ఎన్డీఏలో చేరమని ఆహ్వానించడానికే అని వైసీపీ వర్గాలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడెలాగు ఎన్డీఏ ప్రభుత్వానికి వైసిపి బయట నుండి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఎలాగు మద్దతుగానే నిలబడుతున్నారు కాబట్టి అదేదో అధికారికంగానే ఎన్డీఏలో చేరమని ఆహ్వానాలు అందుతున్నాయనే ప్రచారం ఎప్పటి నుండో చక్కర్లు కొడుతోంది.

అయితే, బీజేపీకి జగన్ ను ఎన్డీయేలోకి ఆహ్వానించే పరిస్థితి ఉండదు. బీజేపీ హిందుత్వ సిద్ధాంతంతో జగన్ కీ నష్టమే కాబట్టి ఇరువురు బయట నుంచే సర్దుబాటు చేసుకుంటారన్న మరో ప్రచారం కూడా ఉంది. పైగా లోక్ సభలో బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదు. రాజ్యసభలో కూడా మరో ఏడాదిలోపు బీజేపీకి సొంత మెజారిటీ రానుంది. అందువల్ల… ఎన్డీయేలోకి జగన్ ఆహ్వానించేంత పెద్ద అవసరం ఏం లేదు. కాకపోతే ఇంతవరకు బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును బేషరుతుగా జగన్ ఆమోదించారు. అందుకే ఈ ప్రచారం జరుగుతుండొచ్చు.