రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలో బ్రేక్ పడింది. నిన్న మొన్నటి వరకు ఇంకేముంది ఆగస్టు నెల ఆఖరిలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారని ఆగస్టు 15న దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అక్టోబర్ నాటికి పదవులను భర్తీ చేసే అంశంపై ఆయన ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ జరుగుతోంది. దీనికి కారణం నాయకులేనని అంటున్నారు.
క్షేత్రస్థాయిలో ఏ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు కొన్నాళ్ల కిందట సర్వే నిర్వహించారు. దీనికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, మండల స్థాయి నాయకులను వినియోగించుకున్నారు. దీనిలో పొరపాట్లు జరిగాయి అన్నది తాజాగా వెలుగు చూసిన అంశం. అంటే క్షేత్రస్థాయిలో నాయకులను ప్రభావితం చేసిన కొంతమంది పదవులు విషయంలో పోటీ పడటం ఒక పదవికి ముగ్గురు నుంచి నలుగురు పేర్లు వినిపిస్తుండడం గమనార్హం.
అంతేకాదు.. వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారై ఉండడంతో ఎవరిని ఎంపిక చేసినా వివాదాలు తప్పవని భావించిన చంద్రబాబు ప్రస్తుతానికి నామినేటెడ్ పదవులు విషయాన్ని పక్కన పెట్టినట్టు సమాచారం. నిజానికి ఒక పదవికి ఇద్దరిని ఎంపిక చేయాలని పార్టీ స్పష్టంగా చెప్పింది. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మాత్రం ఒక పదవికి నాలుగు నుంచి ఐదుగురు చొప్పున పేర్లు వచ్చాయి.
అంతేకాదు.. అనేకమంది నాయకులు దొడ్డిదారుల్లో ప్రయత్నాలు చేయడం చంద్రబాబుకు విసుగు తెప్పించింది. దీంతో ఈ పదవులు వ్యవహారాన్ని పక్కన పెట్టి తర్వాత చూద్దాం అన్నవిధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా అక్టోబర్ వరకు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు వెయిట్ చేయాల్సిందేనని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates