ఫ‌లించిన చంద్ర‌బాబు మంత్రాంగం.. 15 వేల కోట్లు త్వ‌ర‌లో!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంత్రాంగం ఫ‌లించింది. ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అమ‌రావ‌తి కోసం.. కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించిన రూ.15 వేల కోట్ల‌ను ఇప్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌ధాని మోదీ స‌హా ఆర్థిక మంత్రినిర్మ‌లా సీతారామ‌న్‌ను కోరారు. దీంతో వారు ప్ర‌పంచ బ్యాంకుతో మాట్లాడిన‌ట్టు ఉన్నారు. ఫ‌లితంగా ఏపీకి ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు విచ్చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు వారు అమ‌రాతిలోని ప్ర‌తి ప్రాంతాన్నీ ప‌రిశీలించి.. క్షుణ్ణంగా ఇక్క‌డి ప్లాన్‌ను రాబోయే సంస్థ‌ల‌ను, న‌వ న‌గ‌రాల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా ఇప్ప‌టికే పూర్త‌యిన భ‌వ‌నాల తాలూకు నాణ్య‌త‌ను కూడా తెలుసుకున్న ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు.. సంతృప్తి వ్య‌క్తం చేశారు. అనంత‌రం చంద్ర‌బాబుతోనూ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అమ‌రావ‌తి ప్రాధాన్యాన్ని.. గ‌తంలో తాము ప్ర‌పంచ బ్యాంకును అప్పు కోసం చేసిన విజ్ఞాప‌న‌ను కూడా ప్ర‌స్తావించారు. అప్ప‌ట్లోనూ ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు వ‌చ్చి చూసి వెళ్లార‌ని.. అయితే.. కొంద‌రు సృష్టించిన అపోహ‌ల‌తో అప్పు ఇచ్చేందుకు నిరాక‌రించిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు. ఇక‌, పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌ల వివ‌రాల‌ను కూడా ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు.

చంద్ర‌బాబు చెప్పిన వివ‌రాల‌పై సంతృప్తి వ్య‌క్తం చేసిన ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు మొత్తం 5 వాయిదాల్లో రూ.15 వేల కోట్ల‌ను ఇచ్చేందుకు ప్రాథ‌మికంగా స‌మ్మ‌తించిన‌ట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబంధించిన ప్రాసెస్ జ‌ర‌గాల్సి ఉంది. అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్రస్థాయి పర్యటనలు, భూసమీకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే.. మ‌రిన్ని విష‌యాల‌ను అధికారుల‌తో చ‌ర్చించాల‌ని చంద్ర‌బాబు సూచించ‌గా.. వారు అంగీక‌రించారు. దీంతో మ‌రో రెండు రోజుల పాటువారు ఏపీలోనే ఉండ‌నున్నారు. ఏదేమైనా.. అమ‌రావ‌తికి రుణం ఇచ్చేందుకు స‌మ్మ‌తించ‌డం చంద్ర‌బాబుకు పెద్ద రిలీఫ్ ల‌భించిన‌ట్టేన‌ని అంటున్నారు.