ఏపీ సీఎం చంద్రబాబు పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్(పీపీపీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని తప్పు పట్టిన వారే.. తర్వాత కాలంలో అనుసరిస్తున్నారని ఆయన అన్నారు. “మొట్టమొదట ఉమ్మడి ఏపీలో నేనే పీపీపీ విధానం అమలు చేశారు. ఆ రోజు నేనేదో తప్పు చేస్తున్నానని కొందరు గగ్గోలు పెట్టారు. కానీ, ఆ మోడల్‌తోనే నేను హైటెక్ సిటీని నిర్మించా. ఇది ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తున్న ఆదాయంలో సింహభాగం దీని నుంచే వస్తోంది. కానీ.. అప్పట్లో పీపీపీ విధానం తీసుకురాకుండా ఉంటే ఇది సాకారం అయ్యేదా?” అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇప్పుడు ఏపీలోనూ పీపీపీ సహా… పీ-4 విధానాలను తీసుకువస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దీనివల్ల మౌలిక సౌకర్యాలు, పెట్టుబడులు, పరిశ్రమలకు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని చంద్రబాబు వివరించారు. కానీ, కొందరు పీపీపీని తప్పుబడుతున్నారని, అయితే.. వారంతా కళ్లు తెరవాలని చంద్రబాబు సూచించారు. పీ-4 విధానాన్ని జర్మనీ, జపాన్, బ్రిటన్, అమెరికా వంటి దేశాలు కూడా అవలంభిస్తున్నాయని.. దీనివల్ల మెరుగైన వసతులు ఏర్పడతాయని.. ప్రజలకు భారం లేని విధంగానే దీనిని తీసుకువస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
“గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం అయిపోయింది. దీనిని సరిచేయాలని చూస్తున్నాం. అదేసమయంలో పీపీపీ, పీ-4 విధానాలను అనుసరించాలని భావిస్తున్నాం. దీనిని తప్పుబడితే ఎలా? అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని చంద్రబాబు తెలిపారు. తాజాగా ఆయన తిరుపతిలోని శ్రీసిటీలో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా వారికి రాష్ట్ర పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళికలను కూడా వివరించారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలు వీలైనంతగా ఉత్పత్తి, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.
తద్వారా.. ప్రజలకు తక్కువ ధరలకే ఉత్పత్తులు అందించే వీలు కలుగుతుందని తెలిపారు. పారిశ్రామికవేత్తలు వినూత్న ఆలోచనలతో రావాలని, అన్ని విధాలా తాము సహకరిస్తామని ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో పీపీపీ విధానం సహా పీ-4 విధానంలో రహదారుల నిర్మాణం, వైద్య శాలల నిర్మాణం దిశగా కూటమి సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల మెరుగైన వసతులు, మౌలిక సౌకర్యాలు కూడా ప్రజలకు చేరువ అవుతాయని అంచనా వేస్తోంది. కానీ, దీనిని కొందరు మేధావులు ఆన్ లైన్ చానళ్లలో తప్పుబడుతూ.. ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పీపీపీ, పీ-4 విధానాలపై వివరణ ఇవ్వడంతోపాటు.. సమర్థించారు.