రాజకీయ పరిణామాలు ఎటు మలుపు తిరుగుతున్నాయో.. అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో సంచలన వ్యవహారాలపై ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. తాజాగా ఇలాంటి చర్చే తెరమీదికి వచ్చింది. జగన్ కన్నా షర్మిల బెటరా? అనేది ప్రధాన అంశం. ఎందుకంటే.. రాజకీయాలను ఎంత వరకు చేయాలో.. అంత వరకే చేయడం.. ఎక్కడ వరకు మాట్లాడాలో అక్కడితోనే సరిపుచ్చడం వంటివి షర్మిలకు తెలిసినంతగా జగన్ కు తెలియడం లేదని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా ఏపీ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ప్రబుత్వం వైపు నుంచి అదేవిధం గా విపక్షాల వైపు నుంచి కూడా నాయకులకు ఆహ్వానాలు అందాయి. వీటిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ సహా చివరకు ఆప్ నాయకులకు కూడా ఆహ్వానాలు అందాయి. ఇక, కీలకమైన ప్రతిపక్షం వైసీపీకి కూడా ఆహ్వానం అందింది. ఎన్నికలకు ముందు వరకు కూడా.. గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు పరితపించిన జగన్.. తర్వాత.. మాత్రం ముఖం చాటేస్తున్నారు.
అధికారం పోయిన దరిమిలా.. ఆయన ఒకే ఒక్కసారి గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత.. మౌనంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఎట్ హోంకు పిలిచినా జగన్ రాలేదు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. షర్మిల హాజరయ్యారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరితోనూ కలివిడిగా ముందుకు సాగారు. టీడీపీ నుంచి జనసేన, కమ్యూనిస్టుల వరకు కూడా.. అందరితోనూ షర్మిల కలివిడిగా మాట్లాడారు. కుశల ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా నారా లోకేష్‌తోనూ హ్యాపీగా స్పందించారు. నిజానికి టీడీపీకి-కాంగ్రెస్‌కు పడదు.
రెండు రోజుల కిందటే ఆరోగ్య శ్రీ పథకంపై షర్మిల విమర్శలు గుప్పించింది. అయినప్పటికీ.. టీడీపీ నేత లతో ఆమె కలిసి పోయారు. ఈ పరిణామాలను గమనించిన నాయకులు.. జగన్ కన్నా షర్మిలే బెటరా? అనే కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాలన్నాక పట్టువిడుపులు ఉండాలి. ఉంటాయి కూడా. కానీ, తాను పట్టిన కుందేలుకు మూడుకాళ్లే అన్న చందంగా జగన్ వ్యవహరించడం.. ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీసింది. ఎట్ హోంకు వచ్చి.. అందరినీ పలకరించి ఉండి ఉంటే.. రాజకీయాలకు అతీతంగా జగన్ పేరు మరింత బలపడేదని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates