గుంటూరు లో జెండా పీకేస్తున్న వైసిపి నేత‌లు

మాచర్ల సహా గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసిపి హవా తగ్గిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు గడిచిన ఐదు సంవత్సరాలలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసిపి జెండా ఎగిరిన విషయం తెలిసిందే. బలమైన పొన్నూరు నియోజకవర్గంలో కూడా గత ఐదేళ్లలో కిలారు రోశయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసిపి హవా నడిచింది. ఒకానొక దశలో అప్ప‌టి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయడం కూడా వైసిపి పుంజుకుందడానికి బలమైన కారణంగా చెప్పుకొచ్చారు.

అయితే.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. ఇక్క‌డ జెండా ప‌ట్టుకునే నాయ‌కులు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఇక మాచర్ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు అదే విధంగా తాడికొండ ప్రతిపాడు పెదకూరపాడులో కూడా వైసిపి నాయకులు హవాచలాయించారు. ముఖ్యంగా పెద్దకూరపాడులో అయితే నంబూరు శంకర్రావు రెచ్చి పోయారు. తమకు తిరుగులేదని ఇక టిడిపి భూస్థాపితం అయిపోయిందని భావించారు. మాచర్లలో అయితే మరింత ఎక్కువగా వైసిపి నాయకులు పేట్రేగిపోయారు.

అయితే గడిచిన రెండు మాసాలలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసిపి నాయకులు ఎవరు కనిపించకపోవడం వాయిస్ వినిపించకపోవడం చెప్పుకోదగిన అంశం. ఒక అంబటి రాంబాబు మినహా మిగిలిన నాయకులు ఎవరు బయటకు రావడం లేదు. పైగా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కిలారి రోశయ్య పార్టీ పదవికి ఏకంగా రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆయ‌న‌ టిడిపిలో చేరేందుకు అవకాశాలు వెతుక్కుంటున్నట్టు తెలుస్తోంది.

అదేవిధంగా అనేకమంది నాయకులు వైసిపికి దూరం కావాలని నిర్ణయించుకున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక‌, వైసీపీ ప్రభావం కోల్పోయినట్టే అనే చర్చ అయితే నడుస్తుండడం విశేషం. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం ప‌ని అయిపోయింది. కొందరు నాయకులు టిడిపిలో చేరాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా తమదే అధికారం అని తమకు తిరుగులేదని భావించిన నాయకులు ఇప్పుడు కంటికి కనిపించకపోవడం గ‌మ‌నార్హం.