ఎన్నికలు జరిగిన నాలుగు నెలలు అయింది. ఫలితం వచ్చి కూడా రెండు మాసాలు అయిపోయింది. గెలుస్తామని భావించి లెక్కలు వేసుకున్న వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. అయితే.. ఇంకా ఆ మూడ్ నుంచి వైసీపీ అధినేత జగన్ బయటకు వచ్చినట్టు కనిపించడం లేదు. నిజానికి ఒక నెల రోజుల పాటు షాక్ లో ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే.. 2019 ఎన్నికల సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు కూడా ఓడిపోతామని అంచనా వేయలేదు. కానీ, అప్పట్లో ఘోర పరాజయం పొందారు.
దీంతో ఒక నెల రోజుల పాటు ఆయన కూడా షాక్‌లోనే ఉన్నారు. కానీ, తర్వాత వెంటనే కోలుకున్నారు. పార్టీని లైన్‌లో పెట్టే ప్రయత్నం చేశారు. పార్టీ నాయకులకు ముందుగా భరోసా కల్పించారు. అంతేకాదు.. ఓడిపోయినా.. తానే గొప్ప అని చెప్పలేదు. ఎక్కడతప్పులు జరిగాయో తెలుసుకుని సమీక్షించుకుంటామ ని.. ప్రజలకు చేరువ అవుతామని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు ఘోర పరాజ యం పొందిన వైసీపీ మాత్రం ఈ తరహా పాటం ఎక్కడా నేర్చుకున్నట్టు కనిపించడం లేదు.
దీనికి కారణం.. జగన్ పదేపదే తాము అధికారంలో ఉండి ఉంటే.. అని వ్యాఖ్యానిస్తుండడమే. “మనం కనుక అధికారంలో ఉండి ఉంటే.. ప్రజలకు అనేక పథకాలు అందేవి. అమ్మ ఒడి అందేది. రైతు భరోసా దక్కేది” అంటూ జగన్ కామెంట్లు చేస్తున్నారు. కానీ, వాస్తవం ఏదైనా.. ఆయన ఇప్పుడు ఓడిపోయారు. జగన్ లేకపోతే.. జనానికి ఏదీ అందదు అనే భావన నుంచి ఆయన బయట పడాల్సిన అవసరం ఉంది. దీనిని ఆయన వదిలి పెట్టలేక పోతున్నారు.
నిజానికి జనం ఎప్పుడో జగన్‌ను మరిచిపోయినట్టు కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత ఎలాంటి సింపతీ కూ డా లభించలేదు. జగన్ పథకాలను మరిచిపోకపోయినా.. ఇప్పటికిప్పుడు కూటమి సర్కారుపై మాత్రం వ్యతిరేకత రాదు. ప్రభుత్వం ఇప్పుడే కదా ఏర్పాటైంది.. త్వరలోనే అమలు చేస్తారని జనాలు నమ్ముతు న్నారు. అంతేకాదు.. ఒక్కొక్కటిగా అయినా అమలు చేస్తారు! అనే నమ్మకంతో ఉన్నారు. దీంతో జగన్ చేస్తున్న కామెంట్లను ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో జగన్ తన మూడ్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. పార్టీని లైన్‌లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది.