16 మంది ఐపీఎస్‌ల‌కు మెమో వెనుక రీజ‌న్ ఇదేనా?

ఏపీలో వైసీపీ హ‌యాంలో అధికార పార్టీ నాయ‌కుల‌కు కొమ్ము కాశార‌ని, వారు చెప్పిన‌ట్టు వ్య‌వ‌హ‌రించి ప్ర‌తిప‌క్షాల కీల‌క నాయ‌కుల‌పై కేసులు న‌మోదు చేశార‌ని భావిస్తున్న 16 మంది ఐపీఎస్‌లకు ఇటీవ‌ల ఏపీ డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల మెమో జారీ చేశారు.

వెయిటింగ్‌లో జాబితాలో ఉన్న మీరు ఎక్క‌డెక్క‌డో ఉంటే కుద‌ర‌ని, ఉద‌యం 10 గంట‌లకు ఆఫీసుకు వ‌చ్చి రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు చేయాల‌ని.. ఆఫీసు ప‌ని వేళ‌లు ముగిసిన త‌ర్వాత‌.. తిరిగి వెళ్లేప్పుడు కూడా రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు త‌ప్ప‌ని స‌రి అని పేర్కొన్నారు.

అంతేకాదు.. అవ‌స‌ర‌మైనప్పుడు పిలిస్తే..వెంట‌నే అందుబాటులో ఉండాల‌ని కూడా డీజీపీ స్ప‌ష్టం చేశారు. ఈ మెమో అటు అధికార వ‌ర్గాల్లోనూ.. ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ కూడా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇలా ఎందుకు చేస్తున్నారు? గ‌తంలో ఎప్పుడూ వెయిటింగ్ లిస్టులో ఉన్న వారి విష‌యంలో ఎవ‌రూ ఇలా ఆదేశాలు జారీ చేయ‌లేదు క‌దా! అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. దీనివెనుక పెద్ద క‌థే ఉంద‌ని తాజాగా వెల్ల‌డైంది. వెయిటింగ్ జాబితాలో ఉన్న అధికారులు ఇప్ప‌టికీ వైసీపీకి స‌హ‌క‌రిస్తున్నార‌న్న‌ది స‌ర్కారుకు అందిన స‌మాచారం.

ఏపీ ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు.. స‌ద‌రు ఐపీఎస్‌ల‌పై నిఘా పెట్టి.. వారిని వెయిటింగ్‌కు పంపించిన నాటి నుంచి ఏ చేశార‌నే విష‌యంపై కూపీ లాగిన‌ట్టు తెలిసింది. దీంతో వారు వైసీపీ నేత‌ల‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని.. ప్ర‌భుత్వం తాజాగా వైసీపీ నేత‌ల‌పై పెట్టిన కేసులు, అదేవిధంగా గ‌నులు, ఇసుక‌, మ‌ద్యం పాల‌సీల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్ర‌మాల‌పై నిజానిజాలు రాబ‌డుతున్న నేప‌థ్యంలో ఆయా కేసుల‌ను నీరుగార్చేందుకు వైసీపీ నేత‌ల‌ను ర‌క్షించేందుకు ఈ 16 మంది ఐపీఎస్‌లు త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌ను వినియోగించుకుంటున్న‌ట్టు తేలింద‌ట‌.

దీనికి సంబంధించి డీజీపీకి స‌మ‌గ్ర‌నివేదిక అందిన నేప‌థ్యంలోనే స‌ద‌రు 16 మంది ఐపీఎస్‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు స‌ర్కారు ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. వీరు నిత్యం ఆఫీసుకు వ‌చ్చి.. ఆఫీసులోనే ఉండేలా.. సాయంత్రం తిరిగి వెళ్లేప్పుడు కూడా.. రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు చేసేలా డీజీపీ ఆదేశాలు ఇవ్వ‌డం వెనుక ఇదే కార‌ణ‌మ‌ని అంటున్నారు. అదేవిధంగా వారు విజ‌య‌వాడ‌, మంగ‌ళ‌గిరి హెడ్ కార్ట‌ర్స్‌ను దాటి వెళ్ల‌డానికి వీల్లేద‌ని కూడా పేర్కొన‌డం వెనుక రీజ‌న్ కూడా ఇదేన‌ని చెబుతున్నారు.