కుంకి క‌థ ఇదీ.. ఏపీకి ఎందుకు?

విష‌యం కొత్త‌దైన‌ప్పుడు.. లేదా మెజారిటీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌న‌ప్పుడు గూగుల్‌ను ఆశ్ర‌యించ‌డం ప‌రిపాటి. అర‌చేతిలో ఉన్న ఫోన్‌లో గూగుల్‌ను ఆశ్ర‌యించి.. త‌మ సందేహాలు తీర్చుకుంటున్నారు. ఇలా.. గ‌త రెండు రోజుల్లో ఎక్కువ మంది గూగుల్‌ను ఆశ్ర‌యించిన అంశం.. కుంకి. వీటి గురించే ఎక్కువ‌గా శోధిం చార‌ని గూగుల్ పేర్కొంది. అస‌లేంటి ఈ కుంకి అనేది ఎక్కువగా అన్వేషించార‌ట‌. దీంతో ఇప్పుడు కుంకి క‌థ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌ల డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌.. క‌ర్ణాట‌క‌కు వెళ్లి.. కుంకి ఏనుగుల‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని కోరారు. మొత్తం 8 ఏనుగుల‌ను ఆయ‌న కోర‌గా.. అక్క‌డి ప్ర‌భుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో సాధార‌ణ ఏనుగుల‌కు, కుంకి ఏనుగుల‌కు తేడా ఏంటి? అనేది చ‌ర్చ‌గా మారింది. అన్నీ ఏనుగులే అయిన‌ప్పుడు.. కుంకి ఏనుగులకు ప్ర‌త్యేక‌త ఏం ఉంటుంది? అనేది కూడా ప్ర‌శ్న‌. అయితే.. అన్నీ ఏనుగులే అయినా.. కుంకి ఏనుగుల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చి.. సాధార‌ణ ఏనుగుల‌పై యుద్ధానికి సిద్ధం చేస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు దేవాల‌యాల్లో స్వామివారి సేవ‌ల‌కు వినియోగించే ఏనుగులు ఉంటాయి. వీటి ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి.. వాటికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చి.. దైవ కార్యాల‌యాల‌కు వినియోగిస్తారు. అలానే ఏనుగుల్లోనూ కొన్నింటిని ఎంపిక చేసి శిక్ష‌ణ ఇచ్చి.. వాటికి కుంకి ఏనుగులుగా పేర్కొంటారు. ఇవి సాధార‌ణ ఏనుగుల‌ను ఎదుర్కొనేలా ఉంటాయి. సాధార‌ణ ఏనుగుల‌పై ఇవి యుద్ధం చేసిన‌ట్టుగా విజృంభిస్తాయి. అయితే ఒక్కొక్క‌సారి సాధార‌ణ ఏనుగులు బ‌లంగా ఉంటే తిర‌గ‌బ‌డ‌తాయి. ఇలాంటి సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. అందుకే కుంకీ ఎనుగుల‌కు ప్ర‌త్యేక‌త ఉంది.

ఏపీకి ఎందుకు?

ఇప్ప‌టికిప్పుడు కుంకీ ఏనుగుల అవ‌స‌రం ఏంటి? అనేది మ‌రో ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో వన్య ప్రాణులు జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి. ఇలానే ఏనుగులు కూడా చిత్తూరు, అనంత‌పురం స‌హా ఇత‌ర ప్రాంతాల్లోకి వ‌స్తూ.. పంట‌ల‌ను, ఇళ్ల‌ను కూడా నాశ‌నం చేస్తున్నాయి. దీనిని అడ్డుకునేందుకు.. చాలా ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యాల్లో సాధార‌ణ ఏనుగుల‌ను త‌రిమేసేందుకు కుంకీ ఏనుగుల‌ను రంగంలోకి దింపుతారు. ఇవి ప్ర‌త్యేక‌మైన ఘీంకారాలు, ప‌రుగు ద్వారా.. సాధార‌ణ ఏనుగుల‌కు భ‌యం క‌లిగించి.. ఆ ప్రాంతం నుంచి త‌రిమి కొడ‌తాయి. దీనివల్ల ఏనుగుల‌కు ఎలాంటి ప్ర‌మాదం లేకుండా.. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా ఉంటుంది.