త‌ప్పు చేసిన వాళ్ల‌కు శిక్ష ప‌డాల్సిందే

ఏపీకి ఒక బ్రాండ్ ఉంద‌ని.. కానీ, గ‌త ఐదేళ్ల‌లో ఆ బ్రాండ్ దెబ్బ‌తింద‌ని.. దీనిని తిరిగి సాధించేందుకు తాము ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. 78వ పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను పుర‌స్క‌రిం చుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో త్రివ‌ర్ణ ప‌త‌కాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉన్న‌ట్టు తెలిపారు. సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగాముందుకు సాగుతామ‌ని చెప్పారు.

టార్గెట్ 100!

త‌మ పాల‌న‌లో 100 రోజుల ప్రణాళికను ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్ని శాఖల‌ను గాడిలో పెడుతున్న‌ట్టు తెలిపారు. ఏపీ సమగ్రాభివృద్ధి కోసం ప‌క్కా నిర్ణయాలతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. 15% వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు జలకళ వచ్చిందన్నారు. రాష్ట్రంలోని సాగును బాగు చేసేందుకు కూడా తాము క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. రైతుల‌ ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామ‌న్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చేప‌డుతున్న స్కిల్ సెన్స‌స్ ద్వారా యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు మ‌రింత పెరిగేలా చూస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ స‌ర్కారు నిర్వాకం కార‌ణంగా ఉపాధి, ఉద్యోగ రంగం పూర్తిగా దెబ్బ‌తిన్నాయ‌ని అన్నారు. గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తామ‌ని ఒక్క‌రిని కూడా వ‌దిలేది లేద‌ని చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఉచిత ఇసుకను మ‌రింత‌గా పేద‌ల‌కు చేరువ చేస్తామ‌ని చెప్పారు. దీనిపై ఇప్ప‌టికే అనేక రూపాల్లో స‌మీక్ష‌లు చేశామ‌ని అన్నారు. పేద‌ల‌కు ఇబ్బందిలేని వ్య‌వ‌స్థ‌ను తీసుకురానున్న‌ట్టు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. త‌ప్పు చేసిన వారిని ఎట్టిప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్టేది లేద‌ని మాజీ మంత్రి జోగిర‌మేష్ స‌హా వైసీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా చంద్ర‌బాబు హెచ్చ‌రిం చారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ అక్రమాలపై మ‌రింతగా దర్యాప్తు చేయిస్తామ‌న్నారు. ఎవ‌రినీ వ‌దిలి పెట్టేది లేద‌ని తేల్చి చెప్పారు.