ఏపీలో ‘ఈ-పాల‌న‌’

ఏపీలో చంద్ర‌బాబు కూట‌మి స‌ర్కారు.. ఇక ఈ-పాల‌న దిశ‌గా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించింది. ఇప్పటి వ‌ర‌కు ఫిజిక‌ల్‌గా తీసుకునే నిర్ణ‌యాలు.. స‌మీక్ష‌లు, స‌మావేశాలు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించేందుకు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతున్నారు. కొత్త నిర్ణ‌యాలు తీసుకునేందుకు కూడా దోహ‌ద‌ప‌డుతున్నాయి. ఇక‌, ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని నడిపించేందుకు కూడా ఈ స‌మావేశాల్లో నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అయితే.. ఒక్కొక్క‌సారి కీల‌క మంత్రులు అనివార్య కారణాల‌తో స‌మీక్షా స‌మావేశాల‌కు, మంత్రి మండ‌లి స‌మావేశాల‌కు కూడా రాలేక పోతున్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకున్నసీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు ‘ఈ-పాల‌న‌’కు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యారు. ఒక‌వైపు ఫిజిక‌ల్ పాల‌న కొన‌సాగిస్తూనే.. మ‌రోవైపు.. ఈ-పాల‌న ద్వారా మ‌రింత మెరుగులు అద్ద‌నున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రుల‌కు, సీనియ‌ర్ అధికారుల‌కు ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లు, అధునాత‌న ఐ-ఫోన్ల‌ను కొనుగోలు చేసి ఇవ్వ‌నున్నారు. త‌ద్వారా.. మంత్రులు ఎక్క‌డ ఉన్నా.. ఈ-స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. ఫ‌లితంగా వారి శాఖ వివ‌రాల‌ను మంత్రులు క్షుణ్ణంగా తెలుసుకునే అవ‌కాశం ఉండ‌నుంది.

ఒక్కొక్క‌సారి తుఫాన్లు, ఇత‌ర కారణాల‌తో అధికారులు సైతం కీల‌క స‌మావేశాల‌కు రాలేని ప‌రిస్థితి, స‌మయం పాటించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీనిని అరిక‌ట్టేందుకు కూడా ఈ-పాల‌న ఉపయోగ‌ప‌డుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా పాల‌న అంతా పార‌ద‌ర్శ‌కంగా సాగేందుకు.. అన్ని ఫైళ్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో అందుబాటులో(అధికారులు-మంత్రుల‌కు) ఉంచ‌నున్నారు. త‌ద్వారా సత్వ‌ర‌మే నిర్ణ‌యం తీసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తారు. దీనివ‌ల్ల పాల‌నలో వేగం, పార‌ద‌ర్శ‌క‌త కూడా క‌నిపిస్తాయ‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌.