సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండు మాసాలే అయిందని చెబుతూనే.. ఇంతలోనే ప్రజల్లో భారీ వ్యతిరేకతను మూటగట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు హైదరాబాద్ బిర్యానీ పెడతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పచ్చడి మెతుకులు కూడా పెట్టడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఆయన త్వరలోనే దిగిపోవడం ఖాయమని చెప్పారు.
విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో ఉన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా ఎన్నికల పరిదిలోకి వచ్చే అనకాపల్లి, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో జగన్ తాజాగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో సమావే శమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్ని వత్తిడులు వచ్చినా.. సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను గెలిపించాల ని సూచించారు.(వాస్తవానికి కూటమి పోటీలోనే లేదు. వారిపై వత్తిళ్లు వచ్చే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. అయినా ముందు జాగ్రత్తగా జగన్ హెచ్చరించారని తెలుస్తోంది) అంతేకాదు.. ఈ విజయాన్ని పార్టికి నైతిక విజయంగా జగన్ పేర్కొనడం గమనార్హం.
ఇక, ఇదేసమయంలో ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పి మోసం చేస్తు న్నాడని జనం మాట్లాడుకుంటున్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు పలావు పెట్టి బాగానే చూసుకున్నామని కూడా అనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ లేదు. చివరకు పచ్చడి మెతుకులు కూడా లేవు. ప్రజలకు పస్తులు తప్పడంలేదు. చంద్రబాబు చేస్తున్న మోసం ఏంటో ప్రజలకు బాగా అర్థమవుతోంది అని జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, వైసీపీ అధికారంలో ఉండి ఉంటే.. అనేక పథకాలు ఇప్పటికే అందేవని చెప్పకొచ్చారు.
మంచి చేసి ఓడాం!
గతంలో చెప్పినట్టే జగన్ మరోసారి ఎన్నికల్లో ఓటమిపై స్పందించారు. ప్రజలకు మంచి చేసి ఓడిపోయామన్నారు. దీనిని విన్న పార్టీ నాయకులు నవ్వుకోవడం గమనార్హం. మంచి చేసి ఓడిపోయామన్న వాదన ప్రజలు కూడా నమ్మడం లేదని.. కొన్నాళ్ల కిందట అనంతపురానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇక, గతంలో నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. చీకటి తర్వాత వెలుగు ఎలా ఉంటుందో. కష్టాల తర్వాత విజయం కూడా అలాగే వస్తుంది అని జగన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సంపూర్ణ మెజారిటీ దక్కించుకుని అధికారంలోకి వస్తుందని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశలో కూరుకుపోవాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates