విశాఖ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఉప ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయం స్పష్టంచేశారు. ఎన్నికలలో నిలబడి గెలవడం పెద్ద ఇబ్బంది కాకున్నా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పోటీ చేయడంకన్నా, దానికి దూరంగా ఉండడమే హుందాగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తుంది.
ఉమ్మడి విశాఖలో 60 శాతం పైగా స్థానిక సంస్థల ప్రతినిధులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు. అయితే ఇటీవల శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిగా కూటమికి చెందిన వారు గెలిచారు. కూటమి ఘన విజయంతో విశాఖ కార్పోరేషన్ లోని పలువురు కార్పోరేటర్లు టీడీపీలో చేరారు.
టీడీపీ తరపున శాసనమండలి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపితే గెలిపించుకునేందుకు తమ పరిధిలోని వైసీపీ పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీల మద్దతు కూడగట్టే బాధ్యతను తాము తీసుకుంటామని కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబుకు భరోసా ఇచ్చారు. అయితే కేవలం ఒక ఉప ఎన్నిక కోసం అంత మంది స్థానిక ప్రజా ప్రతినిధుల మద్దతు కోసం ప్రయత్నించడం బాగుండదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు హుందాగా పోటీ చేయడం లేదని ప్రకటించారు.
వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ సోమవారం మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ప్రస్తుతం కూటమి నుండి ఎవరూ బరిలోకి దిగడం లేదని స్పష్టంచేసిన నేపథ్యంలో బొత్స నామినేషన్ పత్రాలు అన్నీ సక్రమంగా ఉంటే ఆయన గెలుపు ఏకగ్రీవం కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates