కేసీఆర్ కు ఇష్టమైన అధికారి ఔట్!

తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్‌ను నాయ‌కులు కాకా ప‌ట్టిన విషయం తెలిసిందే. ఇది రాజ‌కీయంగా త‌ప్పుకాదు. ప‌ద‌వులు, అవ‌కాశాల కోసం.. రాజ‌కీయ నేత‌లు కాకా ప‌డ‌తారు. కాళ్ల‌పై కూడా ప‌డ‌తారు. ఇది స‌హజం. అయితే.. కొంద‌రు అధికారులు కూడా ఇదే పంథాను అనుస‌రించారు. కాళ్ల‌పై ప‌డ‌లేదు కానీ.. అప్ప‌టి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్‌.. బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుడిగానే వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వీఆర్ఎస్ తీసుకుని.. కేసీఆర్ పంచ‌కు చేరిపోయారు. ఇలా మ‌రికొంద‌రు అధికారులు కూడా ఉన్నారు.

అయితే.. అంద‌రిలోకీ ప్ర‌ముఖంగా క‌నిపించిన మ‌రో అధికారి.. రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్ జీ. శ్రీనివాస‌రావు. ఈయ‌న కండువా క‌ప్పుకోలేదంతే! అన్న‌ట్టుగా బీఆర్ఎస్ కు వంత పాడార‌ని అప్ప‌ట్లో కాంగ్రెస్ నాయ‌కులు అనేక సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి కూడా అలానే ఉండేది. ఏ చిన్న ఆరోప‌ణ వ‌చ్చినా.. వెంట‌నే రియాక్ట్ అయి.. స‌ర్కారుపై విమ‌ర్శ‌లు రాకుండా అడ్డుప‌డేవారు. అంతేకాదు.. స‌ర్కారు త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకున్న‌ట్టు మాట్లాడారు. ఇక‌, గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్‌కు ఆయ‌న ప‌దే ప‌దే కాళ్ల‌కు ద‌ణ్ణం పెట్టిన విష‌యం తెలిసిందే.

ఒకానొక సంద‌ర్భంలో అయితే.. కేసీఆర్ ప‌ట్టించుకోలేదేని.. వ‌రుస‌గా మూడు సార్లు ఆయ‌న పాదాలు ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు శ్రీనివాస‌రావు. అంతేకాదు.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఆయ‌న అసెంబ్లీ టికెట్ ఆశించిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. కానీ, కేసీఆర్ ఆయ‌న‌కు ఇవ్వ‌లేదు. క‌ట్ చేస్తే.. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ వ‌చ్చింది. ఇక‌, అప్ప‌టి నుంచి శ్రీనివాస‌రావు.. విధుల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. అంతేకాదు.. సుదీర్ఘ సెల‌వుపై కూడా వెళ్లిపోయారు. ఇక‌, ఈఏడాది ఏప్రిల్‌లోనే ఆయ‌న వాలంట‌రీ రిటైర్మెంట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మొత్తానికి సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. నాలుగు మాసాల‌కు ప్ర‌భుత్వం ఓకే చెప్పంది.

తాజాగా శ్రీనివాస‌రావు వాలంట‌రీ రిటైర్మెంట్‌కు ఆమోదం తెలుపుతూ.. రేవంత్ రెడ్డి స‌ర్కారు త‌ర‌ఫున గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఏదేమైనా ప్ర‌జ‌ల‌ను, ఉద్యోగాన్ని న‌మ్ముకున్న అధికారులు పైకి వ‌చ్చిన సంద‌ర్భాలు ఉన్నాయే త‌ప్ప‌.. రాజ‌కీయాల‌ను నేత‌ల‌ను న‌మ్ముకున్న‌వారు మాత్రం తెర‌మ‌రుగ‌య్యారు.

ఏపీలోనూ గ‌త వైసీపీ స‌ర్కారును, సీఎం జ‌గ‌న్‌ను న‌మ్ముకుని.. ఆయ‌న చెప్పినట్టు న‌డుచుకున్న అధికారులు దాదాపు ఇప్పుడు రాష్ట్రం వ‌దిలేసిన ప‌రిస్థితి, కేసులు ఎదుర్కొనే ప‌రిస్థితికి చేరిపోయారు. ఏదేమైనా.. ఇలాంటి అధికారుల‌ను చూసి.. ప్ర‌స్తుతం ఉన్న‌వారు నేర్చుకోవాల్సిన అవ‌స‌రంఎంతైనా ఉంది. క‌ట్ చేస్తే.. ఇంత జ‌రిగినా.. బీఆర్ ఎస్ అధినేత నుంచి శ్రీనివాస‌రావుకు ఎలాంటి పిలుపు అంద‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.