బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆమెకు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి మార్చి 21వ తేదీ నుంచి తీహార్ జైల్లోనే ఉంటున్న కవిత ఇప్పటికి చాలా సార్లు బెయిల్ కోసం అభ్యర్థన చేసుకున్నారు. కానీ, ఏ కోర్టూ ఆమెను కరుణించడం లేదు. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కవిత దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. అయితే.. ఈ కేసులో పూర్వాపరాలను మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంటుందని చెబుతూ.. ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కేసును ఈ నెల 20 వరకు(అంటే.. మరో వారం రోజులు) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ బలమైన వాదనలే వినిపించారు. తాజాగా బెయిల్ ఇచ్చిన సిసోడియా ఉదంతాన్ని కూడా ఆయన సుప్రీంకోర్టుకు వివరించారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కవితను మార్చి 15న ఈడీ బలవంతంగా అదుపులోకి తీసుకుందని.. ఆమె పాత్ర ఏమీలేదని చెప్పారు. కేవలం రాజకీయ ఆరోపణలు, కుట్రపూరితంగానే ఆమెపై కేసు పెట్టారని తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. కేసు పూర్వాపరాలను తాము పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంటూ.. విచారణను వాయిదా వేయడం గమనార్హం.