ఏపీలో చిత్రం:  రెండు నెల‌ల త‌ర్వాత బాధ్య‌తలు చేప‌ట్టిన మంత్రి

ఏపీలో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా మిగిలిన వారంతా క‌లిపి 25 మంది ఉన్న విష‌యం తెలిసిందే. ఒక ప‌ద‌వి ఇంకా ఖాళీగానే ఉంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ బాధ్య‌త‌లు తీసుకున్నార‌ని భావించారు. కానీ, ఒక మంత్రి మాత్రం.. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండు మాసాల దాకా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌లేద‌న్న విష‌యం తాజాగా వెలుగు చూసింది. ఆయ‌నే వైసీపీ మాజీ నాయ‌కుడు, నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి.

చంద్ర‌బాబు స‌ర్కారులో ఆనం రామ‌నారాయ‌ణ‌కు కూడామంత్రి ప‌ద‌వి క‌ల్పించారు. అయితే.. ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకున్నార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ భావించారు. కానీ, తాజాగా రెండు మాసాలు పూర్త‌యిన త‌ర్వాత‌(జూన్ 12న చంద్ర‌బాబు స‌హా మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేశారు) ఆదివారం( ఆగ‌స్టు 11) ఆనం త‌న మంత్రి ప‌ద‌వి బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. అమ‌రావతిలోని సచివాలయంలో ఆయనకు కేటాయించిన ఛాంబరులో ఆదివారం ప్ర‌త్యేక పూజ‌లు చేసి బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

కార‌ణం ఏంటి?

ఆనం త‌న బాధ్య‌తలు చేప‌ట్ట‌డానికి కార‌ణం.. దేవ‌దాయ శాఖ‌ను తీసుకోవ‌డం ఇష్టంలేకేన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. త‌న సీనియార్టీని గ‌మ‌నించి ఆర్థిక‌, రెవెన్యూ వంటి కీల‌క శాఖ‌ల‌ను ఆయ‌న ఆశించారు. కానీ, చంద్ర‌బాబు ఈ రెండు శాఖ‌ల‌ను కూడా టీడీపీ సీనియ‌ర్ల‌కు అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో ఆనం అలిగార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రో వైపు ఆనం వ‌ర్గీయులు మాత్రం.. మంచి రోజులు లేవ‌ని, శ్రావ‌ణ మాసం కావ‌డంతో ఆయ‌న ఇప్పుడు ప‌ద‌విని స్వీక‌రించార‌ని అంటున్నారు. ఏదేమైనా.. రెండు మాసాలు ఆగి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఆస‌క్తిగా మారింది.

ప్ర‌క్షాళ‌న చేస్తా..

వైసీపీ హ‌యాంలో ఆల‌యాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని.. బాధ్య‌తుల చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఆనం ప్ర‌క‌టించారు. త‌న హ‌యాంలో ఆల‌యాల కార్య‌నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని చెప్పారు.  గతంలో టీడీపీ హ‌యాంలో కొన‌సాగినట్టుగానే  కృష్ణా, గోదావరి పవిత్ర సంగం వద్ద జల హారతుల కార్య‌క్ర‌మాన్ని తిరిగి ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. రాష్ట్రంలోని 160 దేవాలయాలను అభివృద్ధి చేసే ప‌నులు కూడా ప్రారంభించ‌నున్న‌ట్టు చెప్పారు.  దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఈ సంద‌ర్భంగా ఆనం పిలుపునిచ్చారు.