“నువ్వు ముగ్గురిని పెళ్లి చేసుకుంటే.. ఒక్కొక్క మగాడు వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏక పత్నీ వ్రతం.. మన మతం. ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో సంసారం చేయడం అన్నది మన సంప్రదాయం. ఆ సంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్’’ అంటూ ఒకప్పుడు ఓ టీవీ ఛానెల్ చర్చలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.
కట్ చేస్తే ఇప్పుడు దువ్వాడ తన భార్యాపిల్లల్ని విడిచిపెట్టి మాధురి అనే వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. తమ తండ్రిని తమకు ఇప్పించాలంటూ దువ్వాడ శ్రీనివాస్ కూతుళ్లు చేసిన ఆందోళనతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఆ తర్వాత వారికి తల్లి కూడా తోడయ్యారు. దువ్వాడ మరో మహిళతో ఉంటున్న ఇంటి ముందు వాళ్లంతా ఆందోళన చేపట్టడంతో వ్యవహారం మరింతగా వివాదాస్పదంగా మారింది.
ఆ సందర్భంగా భార్యాపిల్లల్ని బూతులు తిట్టడమే కాక.. వారి మీద రాడ్‌తో దాడికి కూడా ప్రయత్నించారు దువ్వాడ శ్రీనివాస్. ఈ గొడవ అనంతరం ఆయన ఒక మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గురించి ఈ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పవన్ గురించి తాను ఒకప్పుడు చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. అప్పుడు పవన్ జీవితంలో ఏం జరిగిందో తెలియక అలా మాట్లాడానని.. కానీ ఆయన ఏ పరిస్థితుల్లో అలా చేశాడో ఇప్పుడు తనకు అర్థమవుతోందని దువ్వాడ అన్నారు. ఏదైనా మన వరకు వచ్చే వరకు తెలియదని.. ఇప్పుడు తన విషయంలో జరిగింది చూశాక.. పవన్ అప్పుడలా ఎందుకు చేశాడో తనకు తెలిసొచ్చిందని దువ్వాడ అన్నారు.
ఇంతకుముందు పవన్ పరిస్థితి తెలియక తాను అలా పొరపాటుగా మాట్లాడేశానని దువ్వాడ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యవహారం చూశాక ‘కర్మ ఈజ్ ఎ బూమరాంగ్’ అనే సామెతను వల్లె వేస్తున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates