అదానీ.. సెబీ చీఫ్ మీద హిండెన్ బర్గ్ తాజా బాంబ్

వీకెండ్ వేళ.. హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి బాంబ్ పేల్చటం.. శనివారం సోషల్ మీడియాలో తాము కీలక విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ప్రకటించటం తెలిసిందే. మొదట వివరాల్ని వెల్లడించకుండా.. కాసేపట్లో వివరాలు ప్రకటిస్తామని చెప్పిన ఆ సంస్థ ఆ తర్వాత ఆ వివరాల్ని వెల్లడించింది. తాజాగా పేల్చిన బాంబ్.. అదానీ మీదా.. సెబీ ఛీప్ మీదా కావటం షాకింగ్ గా మారింది.

సాక్ష్యాత్తు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఛైర్ పర్సన్ మాధబీ పురీ బోచ్ కు.. ఆమె భర్త ధవళ్ బోచ్ పైనా హిండెన్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ ఆర్థిక అవకతవకలపై లోతుగా విచారణ జరిపేందుకు సెబీ పెద్దగా ఆసక్తి చూపటం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. శనివారం రాత్రి విడుదల చేసిన తాజా నివేదికలో హిండెన్ బర్గ్ వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి.

  • బెర్ముడా.. మారిషస్ లోని అదానీ గ్రూపు డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలు ఉన్నాయి.
  • ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు.
  • పెట్టుబడులకు భారత్ లో ఎన్నో మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. కానీ.. ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గ ధామంగా పేర్కొందిన దేశాల్లో.. అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం ఆశ్చర్యకరం.
  • అదానీ ఆర్థిక అవకతవకల్లో ఏకంగా సెబీ చీఫ్ భాగస్వామిగా ఉన్నారు. అందుకే ఈ అంశంపై లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసింది.
  • అదానీ.. విదేశీ నిధుల మూలాలపై సెబీ విచారణ తేల్చేదేమీ లేదంటూ అప్పట్లో సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది.