తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి దూకుడు మామూలుగా లేదని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఆయన టికెట్ దక్కించుకుని పోటీకి రెడీ అయినప్పుడు.. అనేక విమర్శలు వచ్చాయి. ఆయన ఇక్కడ ఉండరని.. ఢిల్లీలోనో.. బెంగళూరులోనో.. హైదరాబాద్‌లోనో మకాం వేస్తారని.. నియోజకవర్గం ప్రజలు తమ కష్టాలు చెప్పుకొనేందుకు ఫ్లైట్‌లు బుక్ చేసుకోవాలని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా జనసేన మాజీ నాయకుడు పోతిన మహేష్ అయితే మరింత ఎక్కువగా విమర్శలు గుప్పించారు. సుజనా చౌదరిని కార్నర్ చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే.. ఆ విమర్శలకు చెక్ పెడుతూ.. సుజనా తన దూకుడు కొనసాగిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. తొలి నెలలో అంటే.. జూన్ 5- జూలై 5 మధ్య కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలోని కీలక సెంటర్లలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తాను ఈ నెల రోజుల కాలంలో ఏం చేశానో.. చూడండి! అంటూ.. నియోజకవర్గం ప్రజలకు సుజనా చౌదరి వివరించారు. దీంతో అప్పటి వరకు విమర్శలుచేసిన వారికి ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పేశా రు. ఇక, ఇప్పుడు రెండో నెలకు వచ్చేసరికి.. ఈ రెండో నెలలో కూడా తాను నియోజకవర్గానికి చేసిన మేళ్లను వివరిస్తూ..ప్లెక్సీల రూపంలో వివరించారు. ప్రధాన కూడళ్లలో వాటిని ఏర్పాటు చేశారు. దీనికి తోడు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
అదే.. జాబ్ మేళా! ఈ నెల 10న నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆయన ప్రచారం చేస్తున్నారు. సుజనా ఫౌండేషన్ తరఫున పలు కంపెనీలను ఆహ్వానించినట్టు తెలిపారు. యువతీ యువకులు.. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుజనా కోరారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా.. ఇది కొనసాగుతుందని వివరించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. సుజనా ఇక్కడ ఉండడు… ఆయనను గెలిపిస్తే ఫ్లైట్ బుక్ చేసుకోవాలని.. విమర్శించిన వారికి సుజనా బలంగానే సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది.