ఆదివాసీ మహిళలతో చంద్రబాబు సంప్రదాయ నృత్యం

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో సింపుల్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. హుందాతనానికి పెట్టింది పేరుగా పెద్దమనిషి తరహాగా చంద్రబాబు ఎందరో ముఖ్యమంత్రులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ప్రొఫెషనల్ సీఎంగా కాస్త గంభీరంగా కనిపించే చంద్రబాబు సందర్భానుసారంగా ఆటవిడుపుగా వ్యవహరించిన దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అటువంటి అరుదైన దృశ్యం ఒకటి ఈరోజు ఆవిష్కృతమైంది.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఆదివాసి మహిళలతో కలిసి వారి సంప్రదాయ నృత్యం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు గిరిజన మహిళలతో చేయి చేయి కలిపి చిందేశారు. ఈ సందర్భంగా గిరిజన పురుషులు ధరించే కొమ్ము పాగాను చంద్రబాబు ధరించి వారితో మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు గిరిజనుల సంప్రదాయ వాయిద్యం డప్పు వాయించి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం, అరకు కాఫీ ఉత్పత్తులను చంద్రబాబు పరిశీలించి అరకు కాఫీ రుచి చూశారు.

ఈ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు వెంట గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. ఆదివాసీ మహిళలతో చంద్రబాబు సంప్రదాయ నృత్యం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.