ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. విజయవాడ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లిన పవన్ అక్కడి సీఎం సిద్దరామయ్యతో భేటీ అయ్యారు. అయితే.. ఈ పర్యటనలో ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి ఎర్ర చందనం.. బెంగళూరు సహా.. మైసూరుకు తరలి వెళ్తోందని సమాచారం. దీనిపై కూపీలాగిన పవన్ కల్యాణ్.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు వెళ్లారు.
అయితే.. ఇదొక్కటే కాకుండా.. రాష్ట్రంలో కుంకీ జాతి ఏనుగుల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి ఆరు కుంకీ జాతి ఏనుగులను ఇవ్వాలని కూడా కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల అట వీశాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఏనుగుల గుంపులు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంలో.. పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఏనుగులు అవసరమని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో రెండు కుంకీ ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. కుంకీ ఏనుగుల కొరత ఉందని.. అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా కర్ణాటక ప్రభుత్వానికి ఈ విషయాన్ని వివరించారు. ఏపీకి ఆరు కుంకీ ఏనుగుల్ని ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.
అదేవిధంగా అటవీ సంరక్షణ వ్యవహారాలపైనా పవన్ చర్చించనున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే విషయంపైనా ఆయన కర్ణాటక మంత్రులతో చర్చించి.. ఏపీకి సహకారం అందించే చర్యల దిశగా అడుగులు వేయనున్నారు. కాగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ అధికారికంగా చేపట్టిన పొరుగు రాష్ట్ర పర్యటన ఇదే కావడం గమనార్హం. ఈ పర్యటనలో పలువురు అధికారులు కూడా వెళ్లారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates