రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు పడిందా? ఇప్పటి వరకు బీజేపీలో నాయకులు బయటకు రావడం లేదు.. మాట్లాడడం లేదు.. ఎవరికి వారే.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. అన్న విమర్శలకు చెక్ పడిందా? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సోము వీర్రాజు పార్టీ బాధ్యతలు చేపట్టాక.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే, నేతలను బుజ్జగించడం, బలవంతంగా పార్టీ తరఫున మాట్లాడించడం.. ఒత్తిళ్లు చేయడం అనే విషయాలను పక్కన పెట్టి.. వ్యూహాత్మకంగా దేవాలయాల అంశాలను అజెండాగా తీసుకుని ముందుకు సాగుతున్నారు.
దీంతో బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా గడప దాటి.. తమ వాయిస్ వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, నిన్నటికి నిన్న జరిగిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు మంచి ఊపు వచ్చింది. నాయకులు కదిలి వచ్చారు. టీడీపీ నుంచి వచ్చి.. బీజేపీలో చేరిన తర్వాత మౌనంగా ఉన్న మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి వంటివారు కూడా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేశారు. అదేవిధంగా దాదాపు అన్నిజిల్లాల్లోనూ బీజేపీ నాయకులు రోడ్డెక్కారు. ఇది పార్టీకి శుభసూచకమే! అయితే, ఈ పరిణామంతో బీజేపీ బలపడిందా? అనే ప్రశ్న తెరమీదకి వచ్చినప్పుడు.. కాదనేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంత మంది నాయకులు రోడ్డు మీదకి రావడం రికార్డే అయినప్పటికీ.. దీనివెనుక ఉన్న వ్యూహం వేరే ఉందని చెబుతున్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి వంటివారిపై వచ్చిన విమర్శల నేపథ్యంలోనే కేంద్రం నుంచి సహకారం కావాలని ఆశిస్తున్న ఆది వంటివారు రోడ్డు మీదకు వచ్చారు తప్ప.. రాష్ట్రంలో సోము వీర్రాజును చూసి కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వచ్చిన బూమ్ తాత్కాలికమేనని.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలంటే.. కార్యాచరణ ప్రణాళిక మారాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. రాష్ట్రం హిందువులను లక్ష్యంగా చేసుకుని తమవైపు ఆకర్షించుకోవాలని భావించడం వరకు పరిమితం కాకుండా.. సామాజిక వర్గాల వారీగా కూడా బీజేపీ బలపడాల్సి ఉందని సూచిస్తున్నారు.
అయితే, తాజా పరిణామం.. భవిష్యత్తుకు ఊతం ఇస్తుందని.. దీనిని కొనసాగిస్తూ.. మున్ముందు మరింత దూకుడుగా వ్యవహరిస్తేనే తప్ప.. కేవలం ఈ పరిణామంతోనే బీజేపీ పుంజుకుందనే లెక్కలు వేసుకుంటే కష్టమని అంటున్నారు. మరి సోము ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి.