క‌మ్యూనిస్టు దిగ్గ‌జం క‌న్నుమూత‌.. నేటి సీఎంల‌కు స్ఫూర్తి!

దిగ్గ‌జ క‌మ్యూనిస్టు నాయ‌కుడు, ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి బ‌ద్ధ‌దేవ్ భ‌ట్టాచార్య క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 80 సంవ‌త్స‌రాలు. అంద‌రూ విద్యార్థి ద‌శ నుంచి రాజ‌కీయాలు చేశామ‌ని చెబుతారు. కానీ, బుద్ధదేవ్ మాత్రం ఉపాధ్యాయుడిగా ఉంటూ రాజ‌కీయ అరంగేట్రం చేశారు. అది కూడా.. క‌ర‌డుగ‌ట్టిన క‌మ్యూనిస్టు పార్టీలోకి వ‌చ్చారు. వాస్త‌వానికి సంప్ర‌దాయ బెంగాలీ బ్రాహ్మ‌ణ కుటుంబంలో పుట్టిన ఆయ‌న క‌మ్యూనిస్టుగా మారిన త‌ర్వాత‌.. ఆ సంప్ర‌దాయాల‌కు దూర‌మ‌య్యారు.

అత్యంత విన‌య‌శీలి, విధేయుడిగా పార్టీ కోసం ప‌నిచేశారు. 2000 సంవ‌త్స‌రంలో తొలిసారి ముఖ్య‌మంత్రి గా ప‌గ్గాలు చేప‌ట్టిన బుద్ధ‌దేవ్‌.. ఏకంగా 11 సంవ‌త్స‌రాలు ఆ ప‌ద‌విలో ఉన్నారు. రెండు వ‌చ్చిన ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టుల‌ను విజ‌య తీరాల‌కు చేర్చారు. ఆ సాంతం క‌మ్యూనిస్టు యోధుడిగా పేరు తెచ్చుకున్న బుద్ధ‌దేవ్‌.. మిత‌భాషి. కానీ, చేత‌ల్లో మాత్రం ఆయ‌న దూకుడుగా ఉందేవారు. ప్రపంచీక‌ర‌ణ విధానాల‌కు క‌మ్యూనిస్టులు వ్య‌తిరేకంగా. ప్ర‌పంచ బ్యాంకు రుణాల‌కు కూడా వారు వ్య‌తిరేకం.

అయిన‌ప్ప‌టికీ.. బుద్ధ‌దేవ్ రాష్ట్ర ప్ర‌గ‌తిని దృష్టిలో పెట్టుకుని కామ్రెడ్ల‌ను ఒప్పించారు. గ‌త రెండేళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఆయ‌న గురువారం ఉద‌యం త‌న స్వ‌గృహంలో క‌న్నుమూశారు. జ్యోతి బ‌సు త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్ పాల‌న‌ను అందిపుచ్చుకున్న ఆయ‌న.. ఎంత త‌గ్గి జీవించాలో.. ఈ ప్ర‌పంచానికి నేర్పించారు. “క‌మ్యూనిస్టుగా కంటే.. క‌ర్ష‌కుడిగా జీవించ‌డం చాలా ఇష్టం” అని హేతువాద దృక్ఫ‌థాన్ని ప్ర‌క‌టితం చేసిన బుద్ధ‌దేవ్‌.. సాగులో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చారు.

నిజానికి క‌మ్యూనిస్టు పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు క‌త్తిమీద సాము చేయాల్సి ఉంటుంది. ఇత‌ర రాష్ట్రాల్లో మాదిరిగా నిర్ణ‌యాలు తీసుకోలేరు. ఇత‌రుల‌ను స‌మ‌ర్థించ‌నూ లేరు. కానీ, బుద్ధ‌దేవ్ మాత్రం దీనిని చాలా స‌వాల్‌గా తీసుకున్నారు. జ్యోతి బ‌సు వార‌స‌త్వాన్నినిల‌బెడుతూ.. త‌న దైన పంథాను ఏర్పా టు చేసుకున్నారు. అయితే.. ఈ పంథాలో ఏర్ప‌డిన చిన్న‌పాటి లోటు పాట్లు త‌ర్వాత కాలంలో మ‌మ‌తా బెన‌ర్జీకి క‌లిసి వ‌చ్చాయి. ఫ‌లితంగా ఆమె అక్క‌డ ప‌ట్టు సాధించేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.

ఇక‌, ముఖ్య‌మంత్రిగా బుద్ధ‌దేవ్ తీసుకున్న వేత‌నం ఎంతైనా స‌రే.. పార్టీకి వెళ్లిపోయింది. ఆయ‌న‌కు పార్టీ నుంచి అప్ప‌ట్లో 3200 రూపాయ‌లు వేత‌నంగా ల‌భించేది. దానినే ఆయ‌న తీసుకునేవారు. ఫుల్ టైమ‌ర్‌గా పార్టీకి సేవ‌లందించారు. ముఖ్యమంత్రిగా భారీ కాన్వాయ్‌లు ఆయ‌న పెట్టుకునేవారు కాదు. కేవలం రెండు కార్లు, న‌లుగురు సిబ్బందితో ఆయ‌న పాల‌న‌ను సాగించారు. ప్ర‌స్తుతం ఉన్న ఇల్లు కూడా డ‌బుల్ బెడ్ రూం వంటిదే. ఒకే ఒక్క ఇల్లు. ఆయ‌న‌కు ఎక్క‌డా ఆస్తులు లేవు. విల్లాలు, ప్యాలెస్‌లు అస‌లే లేవు. 34 ఏళ్ల పార్టీ సేవ‌లో ఆయ‌న‌కు ద‌క్కింది.. ప్ర‌జాభిమానం మాత్ర‌మే.

కొస‌మెరుపు..:

నాడు ఏపీలో పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య కాలం చేసిన‌ప్పుడు.. జ‌నం త‌ర‌లివ‌చ్చేందుకు రోడ్లు చాల‌న‌ట్టుగానే.. ఇప్పుడు బుద్ద‌దేవ్ మ‌ర‌ణాంత‌రం.. ఆయ‌న పార్థివ దేహాన్ని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చేవారితో క‌ల‌క‌త్తాలోని ర‌హ‌దారులు కూడా స‌రిపోలేదు. కిక్కిరిపోయాయి. మ‌నిషిని మ‌నిషి రాసుకుని ముందుకు జ‌రిగేందుకు కూడా ప‌దినిమిషాల స‌మ‌యం ప‌డుతోందంటే.. బుద్ధ‌దేవ్ పై ప్ర‌జాభిమానం ఎలాంటిదో అంచ‌నా వేయొచ్చు.