పొలిటికల్ మీటర్‌లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వెనుకబడిందా? గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని పుంజుకునేందుకు ఇతర పక్షాలు ప్రయత్నించిన రీతిలో పవన్ ప్రయత్నించలేదా? పైగా మిత్ర పక్షం బీజేపీతోనూ ఆయన కలివిడిగా ఉండలేక పోతున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. దేవాలయాలపై జరుగుతున్న ఘటనలను టీడీపీ, బీజేపీలు తమకు అనుకూలంగా మార్చుకుని.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించడంతోపాటు.. రాజకీయంగా కూడా కొంత మైలేజీ పొందేందుకు ప్రయత్నించాయి.
ఈ విషయంలో సక్సెస్ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. బీజేపీ నేతలు బయటకు వచ్చారు. టీడీపీ నాయకులు ఇళ్లకే పరిమితమైనా.. హాట్ కామెంట్లతో వేడెక్కించారు. ఈ పరిణామాలతో ఆ రెండు పార్టీల్లోనూ కొంత మేరకు గ్రాఫ్ పెరిగిందనే భావన వ్యక్తమవుతోంది. కానీ.. ఇదే సమయంలో యాక్టివ్‌గా ఉండాల్సిన జనసేనాని పవన్ మాత్రం హైదరాబాద్‌కే పరిమితమైనా.. రాష్ట్రంలో కీలక నేతలను కదిలించడంలోను, ఏదో ఒక రూపంలో ఉద్యమించేందుకు, లేదా సదరు దాడులపై ఆశించిన విధంగా స్పందించడంలోను ఒకింత వెనుకబడ్డారనే అభిప్రాయం జనసేనలోనే వ్యక్తమవుతోంది.
పైగా వచ్చే ఎన్నికల్లో అధికారం పంచుకుంటామని.. చెబుతున్న మిత్రపక్షం బీజేపీ.. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించిన సమయంలో ఎక్కడా జనసేన నేతలు కానీ, ఆ పార్టీ జెండాలు కానీ కనిపించలేదు. ఇటీవల కాలంలో పలు వేదికలపై సోము వీర్రాజు మాట్లాడుతూ… జనసేన తమకు నమ్మదగిన మిత్రపక్షమని చెబుతున్నారు. అలాంటప్పుడు.. తాజాగా ఎత్తుకున్న అజెండా విషయంలో పవన్‌ను ఆయనే కలుపుకొని పోలేదా? లేక.. మనకెందుకులే .. అని పవనే దూరంగా ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకున్నారని సమాచారం.
పోనీ.. బీజేపీతో కలిసి ఉద్యమించకపోయినా.. పార్టీ పరంగా అయినా.. ఏదో ఒకరూపంలో రాజకీయ ఎత్తుగడతో ముందుకు సాగడంలో పవన్ విఫలమయ్యారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేక.. కేవలం హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే.. తానే స్వయంగా రంగంలోకి దిగితే.. ఇతర మతస్థుల్లో ఉన్న సానుభూతి తనకు దూరమవుతుందని ఆయన భావించారా? అనే ప్రశ్నలు కూడా తెరమీదికి వస్తున్నాయి. ఏదేమైనా.. తాజా రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ, బీజేపీలు వ్యవహరించిన తీరులో పవన్ దూకుడు చూపించలేకపోయారనేది వాస్తవమని అంటున్నారు పరిశీలకులు.