దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రూ.వంద కోట్ల ఈ స్కాం సంగతి ఎలా ఉన్నా.. దాని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ స్కాంలో భాగంగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతో పాటు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితతో పాటు పలువురు ప్రముఖులు అరెస్టు అయి తీహార్ జైల్లో ఉండటం తెలిసిందే.
లిక్కర్ స్కాంలో తన పాత్ర ఏమీ లేదంటూ మొదట్నించి పదే పదే చెప్పిన ఆమె.. ఈడీ నోటీసులపైనా తీవ్రంగా రియాక్ట్ అయ్యే వారు. నోటీసులు ఇస్తే ఏమవుతుంది? తాను చూసుకోగలన్న ధీమాను ప్రదర్శించారు. అయితే.. ఆమె అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి. చూస్తుండగానే ఆమెను అరెస్టు చేయటం.. తీహార్ జైలుకు తరలించటమే కాదు.. నెలల తరబడి జైల్లోనే ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ కేసులో తన పాత్ర ఏమీ లేదని.. తనపై రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారని.. బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు పెట్టుకున్నారు. తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఆమె పెట్టుకున్న పలు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. పదే పదే ఆమె పెట్టుకుంటున్న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమె తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను తాజాగా విత్ డ్రా చేసుకున్నారు.
ఆమె తరఫు సీనియర్ న్యాయవాది హాజరు కాకపోవటంతో విచారణ వాయిదా వేయాలని కవిత తరఫు లాయర్ కోర్టును కోరారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన జడ్జి.. వాదనలు వినిపించకపోతే విత్ డ్రా చేసుకోవాలని సూచన చేస్తూ ఆగస్టు 7కు పిటిషన్ ను వాయిదా వేసింది. దీనిపై ఈ రోజు (బుధవారం) విచారణ జరగాల్సి ఉంది. ఇంతలోనే ఆమె తన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఐదు నెలలుగా లిక్కర్ స్కాంలో ఆమె జైల్లో ఉన్నారు. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు మాజీ మంత్రి కం సోదరుడు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు రావట్లేదు.