ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినత జగన్‌కు ప్రస్తుతం ఉన్న భద్రతను పెంచలేమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబం దించి జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తనకు గతంలో 139 మందితో భద్రత ఉందని.. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఎలాంటి సమాచారం లేకుండానే వీరిలో సగం మందిని వెనక్కితీసుకుందని ఆయన పిటిషన్‌లో వివరించారు. ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు ఒక రోజు ముందు తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని.. ఆయన హైకోర్టును అభ్యర్థించారు. అదేవిధంగా తనకు ప్రాణ హాని ఉందని కూడా తెలిపారు.
ఈ పరిణామాలపై ప్రభుత్వంలోని పలువురు స్పందించారు. జగన్‌కు ఇంతకు మించిన భద్రత కల్పించలేమని తెగేసి చెప్పారు. జగన్ ప్రస్తుత పొజిషన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే
మాత్రమేనని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని, ప్రజలు కూడా ఇవ్వలేదని.. దీనిని బట్టి ఆయన సాధారణ ఎమ్మెల్యేనేనని.. అయినప్పటికీ.. దాదాపు 70 మందితో భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఇంతకు మించిన భద్రత ఏ రాష్ట్రంలోనూ కల్పించడం లేదన్నారు. ప్రస్తుతం ఇస్తున్న భద్రతను ఎట్టి పరిస్థితిలోనూ పెంచేది లేదన్నారు.
మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జగన్‌కు ఎలాంటి ప్రాణ హానీ లేదన్నారు. పైగా 100 అడుగుల ఇనుప కంచెను ఏర్పాటు చేసుకుని, సుస్థిర భద్రతతో కూడిన తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటున్న జగన్‌కు ఎలాంటి భయం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు కూడా దరి దాపుల్లోకి రాకుండా నాలుగు అంచెల భద్రతను ఆయన నివాసంలో కొనసాగిస్తున్నా రని.. ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారని.. ఎక్కడికైనా బయటకు వస్తే.. ప్రభుత్వం 70మందితో రక్షణ కల్పిస్తోంద ని మంత్రి చెప్పారు. ఇవి కాకుండా స్థానిక పోలీసులు ఎప్పుడూ భద్రతగా ఉంటారని తెలిపారు. జగన్ అత్యాసకు పోతున్నారని వ్యాఖ్యానించారు.
జగన్ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని.. ఏదైనా ఉంటే తప్పకుండా భద్రతను పెంచుతామని.. ఇంకో మంత్రి ఆనం రామ నారా యణ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల నేతగా తనకు తాను చెప్పుకొనే జగన్ ఇప్పుడు ప్రజల మద్యకు వచ్చేందుకు భయపడుతు న్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల మధ్యకు రావడం ఆయనకు మొహం చెల్లడం లేదని.. అందుకే భద్రత పేరుతో ప్రజలకు దూరంగా ఉండాలనే వ్యూహాన్ని అమలు చేసుకున్నట్టు తెలుస్తోందన్నారు. గతంలో చంద్రబాబుకు రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించకపోయినా.. ఆయన ప్రజల్లోకి వచ్చిన విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని సూచించారు.