ఎన్నికలకు ముందు టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ పిక్స్ పథకాలపై క్లారిటీ వచ్చేసిం ది. ఈ పథకాల్లో ముఖ్యమైన వాటిని అమలు చేయాలని తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. ఆర్థికంగా భారం పడని కొన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కలెక్టర్లకు ఆయన తేల్చి చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో చూచాయగా చెప్పిన మాటలను బట్టి ఈ నెల నుంచే కనీసం మూడు పథకాలను అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
వీటిలో ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. వీటితో పాటుగా ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో రెండు కీలకమైన హామీలు నిరుద్యోగ భృతి. నెలకు 1500 రూపాయలు చొప్పున మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి. ఈ పథకాలపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు పథకాలను సాధ్యమైనంత వేగంగా అమలు చేసే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్టు ఆఫ్ ది రికార్డ్ చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్నారు? అనే విషయాలను తేల్చేందుకు త్వరలోనే సర్వే నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అలాగే ఆడబిడ్డ నిధిని ఇచ్చేందుకు రాష్ట్రంలో మహిళలు ఎంతమంది ఉన్నారు? వారిలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? నెలకు 1500 రూపాయలు అవసరం ఎంతమందికి ఉంది? అనే విషయాలను కూడా తేల్చే విధంగా మరో సర్వే చేయాలని నిర్ణయించుకున్నట్టు చంద్రబాబు చెప్పారు.
సూపర్ సిక్స్ పథకాల్లో ఈ రెండు అత్యంత కీలకం. పైగా వ్యక్తిగతంగా ప్రజలకు మేలు చేకూర్చే పథకాలు. అలాగే దీపం పథకం కింద మహిళలకు ఏటా మూడు సిలిండర్లను ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిని అమలు చేసేందుకు కూడా సంసిద్ధంగానే ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో దీపం పథకం కింద ఎన్ని గ్యాస్ సిలిండర్లు వినియోగం అవుతాయో లెక్క తేల్చాలని కలెక్టర్లకు ఆయన ఆదేశించారు. దీనిని బట్టి సూపర్ 6పై చంద్రబాబు స్పష్టంగా ఉన్నారని అమలు చేసేందుకు ఇబ్బంది లేదని భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది. అయితే ఎలా చూసుకున్నా మరో రెండు మూడు మాసాలు మాత్రం ఎదురు చూడక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates