ఫేక్‌గాళ్ల‌ను న‌మ్మొద్దు: చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందుకు వైసీపీ అనుకూల మీడియా ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. సీఎం చంద్ర‌బాబు ఆవేద‌న, ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేశారు. తాజాగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనిలో బాప‌ట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్య‌క‌ర్త‌.. స్థానికంగా ఓ ఎస్సై కాల‌ర్ ప‌ట్టుకున్న‌ట్టుగా వైసీపీ అనుకూల మీడియా ప్ర‌చారం చేసింద‌ని పేర్కొన్నారు. కానీ, దీనిలో వాస్త‌వాన్ని ప్ర‌జ‌లు గ్ర‌హించాల‌ని సీఎం చంద్ర‌బాబు ఎక్స్‌లో కోరారు.

ఫేక్‌ న్యూస్‌, ఫేక్‌గాళ్లను నమొద్దంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఫేక్‌ రాజకీయాల ఉచ్చులో పడి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ‘బాపట్లలో తెలుగుదేశం బరితెగింపు’ శీర్షికతో భట్టిప్రోలు ఎస్సై చొక్కాను టీడీపీ కార్యకర్త పట్టుకున్నారంటూ వైసీపీ పత్రికలో వచ్చిన కథనం ఫేక్‌ అని ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణను పోలీసులు నిలువరిస్తున్న వీడియో ను పోస్టుకు జత చేశారు. ఇలాంటి వార్త‌ల‌తో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దెబ్బ‌తిన్నాయంటూ వైసీపీ ప్ర‌చారం చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు, త‌ప్పుడు వ్య‌క్తుల కార‌ణంగానే రాష్ట్ర బ్రాండ్ దెబ్బ‌తింటోంద‌ని గ‌తంలోనూ చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను అన‌ని మాట‌ల‌ను అన్న‌ట్టుగా.. తాను చేయ‌ని ప‌నులు చేసిన‌ట్టుగా వైసీపీ మీడియా ప్ర‌సారం చేసింద‌ని.. ఇలాంటి వాటిని అంద‌రూ ఖండించాల‌ని అప్ప‌ట్లోనూ చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా పోలీసుల‌నే టీడీపీనాయ‌కుడు ఒక‌రు కొట్టారంటూ.. రాయ‌డంపై చంద్ర‌బాబు సీరియ‌స్‌గానే రియాక్ట్ అయ్యారు.