ఏపీలో ప్రజా పాలన స్థానంలో ముఠాల పాలన జరుగుతోందని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం రాజకీయ హింసకు కేంద్రంగా మారిపోయిందని విమర్శించారు. గత రెండు నెలల కాలంలో రాష్ట్రంలో హింసాయుత కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన.. రాజకీయ ప్రేరేపిత దుర్మార్గాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. రోజూ ఏదో ఒక చోట హింస జరుగుతూనే ఉందని పేర్కొన్నారు.
అంతేకాదు.. రాష్ట్రం ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని జగన్ విమర్శించారు. అయితే.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని.. ఇప్పుడు తనను ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు ఈ రాజకీయ దాడులు చేయిస్తోందని దుయ్యబట్టారు.
వైసీపీ నాయకులపై జరుగుతున్న హత్యా రాజకీయాల వెనుక ప్రభుత్వ పాలకుల హస్తం ఉందని జగన్ ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ దారుణాలకు బలైన పోయిన వారి కుటుంబాలకు, బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తామని జగన్ పేర్కొన్నారు.
ఏం జరిగింది?
ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణం.. తాజాగా నంద్యాలలో జరిగిన హత్యే. నంద్యాల జిల్లాలో శనివారం అర్థ రాత్రి వైసీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. అదేరోజు.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓ నాయకుడిపై దాడి చేశారు. ఆయా ఘటనలను కోట్ చేసిన జగన్.. వీటి వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపిస్తూ.. తాజాగా ట్వీట్ చేశారు.