చివ‌ర‌కు రోగుల భోజ‌నాల బిల్లులూ ఎగ్గొట్టారు!

ద‌మ్ముంటే అసెంబ్లీకి రా.. జ‌గ‌న్‌!! అంటూ వైసీపీ మాజీ నేత‌, ప్ర‌స్తుత మంత్రి కొలుసు పార్థ‌సార‌థి స‌వాల్ రువ్వారు. “శ్వేత‌ప‌త్రాల‌ పై ఏమైనా చెప్పాల‌ని అనుకుంటే.. స‌భ‌కు వ‌చ్చి చెప్పాలి. మీడియా ముందు.. సొంత చానెళ్ల‌లోనూ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం ఎందుకు? అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గోబెల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని ఆయ‌న హెచ్చ‌రించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొలుసు.. జ‌గ‌న్‌ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

జ‌గ‌న్‌కు ఒక విజ‌న్ అంటూ లేద‌ని.. అందువ‌ల్లే రాష్ట్రం అన్ని విధాలా నాశ‌నం అయిపోయింద‌ని చెప్పారు. క‌నీసం ఆసుప‌త్రుల్లో రోగుల‌కు అందించే భోజ‌నాల బిల్లులు కూడా ఇవ్వ‌కుండా ఎగ్గొట్టార‌ని దుయ్య‌బట్టారు.

ఆరోగ్య శ్రీ బిల్లులు ఇవ్వ‌కుండా ఆసుప‌త్రులను ముప్పుతిప్ప‌లు పెట్టార‌ని చెప్పారు. విజ‌న్ లేని నాయ‌కుడి కార‌ణంగానే రాష్ట్రం అథోగ‌తికి చేరుకుంద‌న్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు దీనిని గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఈ క్ర‌మంలో అనేక ఇబ్బందులు కూడా ప‌డుతున్నార‌ని చెప్పారు.

త‌న ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్రానికి జ‌గ‌న్ చేసింది ఏమీలేద‌న్నారు. కేవ‌లం రాజ‌కీయ క‌క్ష సాధింపులు త‌ప్ప‌.. రాష్ట్రానికి రూపాయి కూడా పెట్టుబ‌డులు తీసుకురాలేద‌ని తెలిపారు. దీనికి తోడు దోపిడీలు.. అక్ర‌మాల కుప్ప‌లు ఇప్పుడు బ‌య‌ట ప‌డుతున్నాయ‌ని చెప్పారు.

వీటిని అసెంబ్లీ వేదిక‌గా తాము ప్ర‌స్తావిస్తే.. తాను మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు మీడియా ముందు కూర్చుని క‌బుర్లు చెబుతున్నాడ‌ని అన్నారు. ఢిల్లీ వెళ్లింది ఎందుకు? అని కొలుసు ప్ర‌శ్నించారు.

గంజాయి బ్యాచ్‌లో ఇద్ద‌రి మ‌ధ్య త‌లెత్తిన వివాదం హ‌త్య‌కు దారితీసింద‌ని కొలుసు చెప్పారు. దీనిని కూడా ఢిల్లీ వ‌ర‌కు తీసుకు వెళ్లి ధ‌ర్నా చేయ‌డానికి సిగ్గుండాల‌న్నారు. ఏం జ‌రిగినా.. ప్ర‌భుత్వానికి ఆపాదించ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు.

ఏపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి జ‌గ‌న్ అండ్ కో ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని.. వీటిని తాము స‌మ‌ర్థంగా ఎదుర్కొంటామ‌ని కొలుసు చెప్పారు. ఏదేమైనా స‌భ‌కు వ‌చ్చి తాము స‌చ్ఛీలుర‌మని నిరూపించుకోవాల‌ని సూచించారు.