దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్నది సామెత. కానీ, దీపం ఆరిపోయిన తర్వాత.. అంధకారం చుట్టుముట్టిన తర్వాత.. చక్కబెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు వైసీపీ అధినేత జగన్. ప్రస్తుతం ఆయన 11 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం ఫైట్ చేస్తున్నారు. ఇది వచ్చేనా.. లేదా.. అనేది తర్వాత తెలుస్తుంది. అయితే.. ఇప్పటికిప్పుడు ఆయన కీలక కార్యక్రమానికి రెడీ అయ్యారు. అదే.. ప్రజలతో మమేకం కావడం.. కార్యకర్తలకు కనిపించడం.. వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నాలు చేయడం!
ఔను.. నిజం., దీనికి సంబంధించి శత్రు దుర్భేధ్యమైన.. తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రజలు, పార్టీ కార్యకర్తలు ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని తాజాగా జగన్ ఆదేశించినట్టు తెలిసింది. పార్టీ వర్గాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఊహించని జగన్.. తనంతటివాడు లేడన్నట్టుగా వ్యవహరించారు. తను తప్ప.. ప్రజలకు దిక్కులేదని.. అనుకున్నారు. తనను గెలిపించి తీరుతారని కూడా లెక్కలు వేసుకున్నారు. కానీ, ప్రజలు ఆయనకన్నా తెలివైన వారు కావడంతో చడీ చప్పుడులేకుండా.. ఎమ్మెల్యేగా మిగిలిపోయారు.
అప్పట్లో ప్రజలకు చేరువకావాలి. .పార్టీ కేడర్‌ను పట్టించుకోవాలని.. చాలా మంది నాయకులు చెప్పుకొచ్చా రు. కానీ, జగన్‌కు వినిపించలేదు. తొలి ఏడాది అంటే.. 2019లో ఏదో కొన్ని రోజుల పాటు.. పార్టీ కార్యాల యంలో ప్రజాదర్బార్ నిర్వహించినా.. తర్వాత.. దానిని పూర్తిగా మరిచిపోయారు. అంతేకాదు.. ప్రజలకు అన్నీ మేళ్లే చేస్తున్నాం.. ఇక, వారికి సమస్యలు ఏముంటాయని కూడా గడుసు వ్యాఖ్యలు చేసిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. ఇక, పార్టీ కేడర్ విషయంలోనూ ఇలానే వ్యవహరించారు.
పార్టీ కేడర్‌ను అసలు దరి చేరనివ్వకుండా.. ప్రజలకు-వలంటీర్లకు మధ్య బంధాన్ని పెంచారు. చివరకు అది ఎదురు దెబ్బకొట్టింది. దీంతో ఇప్పుడు అసలు వాస్తవం తెలిసింది. ఫలితంగా.. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మీ జగన్ లేదా.. జనం కోసం జగన్ పేరుతో కొత్తగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక, నుంచి ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజుల పాటు తాడేపల్లి లోని పార్టీ కార్యాలయంలో జగన్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. దీనికి సంబంధించి ఒకే సారి 100 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వారికి టిఫిన్ , కాఫీలు, భోజనాలు కూడా ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. ఏదేమైనా.. బట్టతల వచ్చిన తర్వాత.. దువ్వెన కోసం జాగ్రత్త పడినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.