“పెత్తందారీ పాలకుడి తప్పులు సరిచేస్తున్నాం. దీనికి సమయం పడుతుంది. అయినా కష్టపడతాం. పనిచేస్తాం. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం” అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెత్తందారు ఎవరో ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. తాజాగా ఆయన భూములు సహా రెవెన్యూ వ్యవహారాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. గత పెత్తందారీ పాలకుడు చేసిన తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నామని చెప్పారు. “ప్రజల ఆస్తులను కబళించేందుకు ప్రయత్నాలు సాగాయి. అందుకే పట్టాదారు పాసుపుస్తకాలు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలపై గత పాలకుడి ఫొటోలు వేసుకున్నారు” అని వ్యాఖ్యానించారు.
ప్రజల ఆస్తులకు ప్రభుత్వం భద్రత కల్పించాలే తప్ప.. ప్రజల ఆస్తులను, రైతుల భూములను తనవిగా ప్రచారం చేసుకునేందుకు గత పాలకుడు ప్రయత్నం చేశారని.. అందుకే ప్రజలు ఛీ కొట్టారని అన్నారు. ప్రజలు విజ్ఞులని.. ఎవరు పెత్తందార్లో.. ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో గ్రహించారని తెలిపారు. అందుకే ఈ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. తమ ప్రజా ప్రభుత్వంలో పెత్తందారీ పోకడలకు స్థానం లేదని.. ప్రజలకు మెరుగైన గవర్నెన్స్‌ను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. “పట్టాదారు పాస్ పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నాం” అని చందరబాబు వెల్లడించారు.
అయితే.. మార్పు ఇప్పటికిప్పుడు రాదని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ కొన్నాళ్లు పడుతుందన్నారు. అనేక తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అధికార దాహంతో వ్యవస్థల నాశనం, భూములను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో అప్పటి పాలకుడు రెచ్చిపోయాడని తెలిపారు. ఇప్పుడు వాటిని సరిదిద్దుతున్నామన్నారు. 22ఏ భూములను అన్యాక్రాంతం చేసేందుకు, సొంత వారికి ఇచ్చుకునేందుకు జగన్ ప్రయత్నించారని దుయ్యబట్టారు. వాటిని సరిచేసి.. అసలైన లబ్ధి దారులకు అందిస్తామన్నారు. దీనికి కొంత సమయం పట్టినా.. అందరికీ న్యాయం జరుగుతుంద న్నారు.
కాగా, ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పెత్తందారులు, పేదల నాయకుడు అంటూ.. జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దుష్టచతుష్టయం అంటూ ఆయన చేసిన విమర్శలు కూడా తెలిసిందే. వీటిని తాజాగా చంద్రబాబు ఉటంకిస్తూ.. ఎక్కడెక్కడ ఏయే పనులు జరిగాయో చూస్తే.. పెత్తందారులు ఎవరో తెలుస్తుందన్నారు. దీనినిప్రజలు ముందుగానే గ్రహించి తీర్పు చెప్పారన్నారు. ప్రజల ఆస్తులను, వారి భూములను సొంతం చేసుకునేందుకు.. ప్రజలపై పెత్తనం చేసేందుకు మాత్రమే అప్పట్లో పాలకుడు అధికారాన్ని వినియోగించుకున్నట్టు పేర్కొన్నారు.