కేసీఆర్‌కు భారీ షాకిస్తున్న రేవంత్‌.. ఇదే జ‌రిగితే!

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే..తెలంగాణ తెచ్చార‌ని.. తెలంగాణ కోసం కొట్లాడార‌ని.. ఆయ‌న లేక‌పోతే తెలంగాణ వ‌చ్చేది కాద‌ని.. ఆయ‌న వ‌ల్లే ద‌శాబ్దాల క‌ల సాకార‌మై.. తెలంగాణ కోటి ర‌త‌నాల వీణ అయింద‌ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయ‌కులు చెబుతారు. అంతేకాదు.. కేసీఆర్ కూడా ప‌దే ప‌దే చెబుతార‌నే విష‌యం తెలిసిందే. “అనేక మార్లు కొట్లాడినం.. సాధించినం” అంటూ.. ఎన్నిక‌లకు ముందు, త‌ర్వాత కూడా.. కేసీఆర్ చెప్పిన‌, చెబుతున్న విష‌యం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా అసెంబ్లీలోనూ ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. “కేసీఆర్ తెలంగాణ తేకుంటే.. మీరు ముఖ్య‌మంత్రి అయ్యేవారా?” అంటూ బీఆర్ఎస్ నేత‌లు వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. సీరియ‌స్‌గానే రియాక్ట్ అయ్యారు. లెక్క‌లు తీయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. “తెలంగాణ కోసం.. కేసీఆర్ చేసిందేంటి? పార్ల‌మెంటులో ఆయ‌న ఎన్ని గంట‌లు తెలంగాణ కోసం పోరాడిండు. అసెంబ్లీలో ఎన్ని సార్లు ప్ర‌శ్నించిండు లెక్క‌లు తీయాలి” అని అసెంబ్లీ స్పీక‌ర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇదేస‌మ‌యంలో తాను తెలంగాణ కోసం.. అప్ప‌టి ఉమ్మ‌డి అసెంబ్లీలో గ‌ళం విప్పాన‌ని.. తాను మాట్లాడినన్ని గంట‌లు కూడా.. కేసీఆర్ మాట్లాడ‌లేద‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. తాను మాట్లాడిన లెక్క‌లు కూడా తీయాల‌ని స్పీక‌ర్‌ను కోరారు. దీంతో సీఎం విన్న‌పం మేర‌కు.. రేపో మాపో.. ఈ లెక్క‌లు బ‌య‌ట‌కు రానున్నాయి. ఇదే జ‌రిగితే.. కేసీఆర్ తెలంగాణ కోసం.. అటు పార్ల‌మెంటు ఇటు అసెంబ్లీలో ఎంత సేపు మాట్లాడారు? ఎన్ని గంట‌లు చ‌ర్చించారు? అనే విష‌యాలు తేట‌తెల్లం అవుతాయి.

అయితే.. నిజంగానే బీఆర్ఎస్ నాయ‌కులు చెబుతున్న‌ట్టుగా కేసీఆర్ బ‌ల‌మైన పోరాటం చేసి ఉంటే.. ఆయ‌న‌కు ప్ల‌స్ అవుతుంది. అలా కాకుండా.. కేసీఆర్ స‌భ‌ల్లో ఒక‌లా.. బ‌య‌ట మ‌రోలా క‌నుక వ్య‌వ‌హ‌రించి ఉంటే.. దీనిని ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం అడ్వాంటేజ్‌గా తీసుకునే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా ..ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై ఎవ‌రూ దృష్టి పెట్ట‌క‌పోవ‌డం.. తొలిసారి కేసీఆర్ తెలంగాణ కోసం ఎలా వ్య‌వ‌హ‌రించార‌న్న రికార్డులు బ‌య‌ట‌కు తీస్తుండ‌డం సంచ‌ల‌నంగానే మార‌నుంది.