రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపిన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్టు.. వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. శనివారం రాత్రి సమయంలో బెంగళూరు విమానాశ్రయంలో మోహిత్ రెడ్డి సహా ఆయన తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం.. తిరుపతి జిల్ల కోర్టులోను ప్రవేశ పెట్టనున్నట్టు ప్రకటించారు. దీంతో ఇంకేముంది.. చెవిరెడ్డి అక్రమాలకు, దౌర్జన్యాలకు తెరపడినట్టేనని అధికార పార్టీ టీడీపీ నాయకులు అంచనాకు వచ్చారు.
అయితే.. అనూహ్యంగా ఈ కేసు మలుపు తిరిగింది. శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్న మోహిత్‌ను పోలీసులు ఆదివారం ఉదయానికే విడుదల చేసేశారు. ఈ సందర్భంగా ఆయనకు 41 ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారు. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ.. ఐదు రోజులపాటు ఆయనకు సమయం ఇచ్చారు. దీంతో తీవ్ర సంచలనం రేపిన ఈ వ్యవహారం ఒక్కసారిగా సర్దుమణిగిపోయింది. మరి ఇంతలోనే ఏం జరిగింది? అనేది కీలకంగా మారింది. పోలీసుల వైపు నుంచి చూస్తే.. తాము నిబంధనల ప్రకారం 41 ఏ కింద నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు.
అసలు నిబంధనల ప్రకారమే అయితే.. ఎప్పుడో ఈ నోటీసులు ఇచ్చి ఉండాల్సింది. కానీ..ఇవ్వలేదు. అరెస్టు చేసినట్టు కూడా ప్రకటించారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత.. 41 ఏ నోటీసులు ఇవ్వడం సమంజసం కాదు. ముందుగానే ఇచ్చి.. వివరణ తీసుకోవాలి. ఆ తర్వాత.. మాత్రమే అరెస్టు అవసరమైన పక్షంలో చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా గతంలో పేర్కొంది. కానీ, ఇక్కడ అలా జరగలేదు. అరెస్టు చేసిన తర్వాత.. 41ఏ నోటీసులు ఇచ్చారు. ఇక్కడే కీలకమైన పరిణామం చోటు చేసుకుందని అంటున్నారు.
ప్రభుత్వంలో ఉన్న చెవిరెడ్డి సానుభూతిపరులు(వారు ఎవరైనా కావొచ్చు. ఒకరిద్దరు మంత్రులు కూడా ఉన్నారని సమాచారం) మోహిత్ అరెస్టు విషయం తెలిసిన వెంటనే.. కీలక నేత ద్వారా చక్రం తిప్పి.. అరెస్టు నుంచి మోహిత్‌ను కాపాడారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి సరైన ఆధారాలు అయితే లేవు. కానీ, జరిగిన పరిణామాలు మాత్రం ఏదో జరిగిందనే వాదనను మాత్రం బలపరుస్తున్నాయి. మొత్తానికి మోహిత్ అయితే సేఫ్ అయ్యాడు. మరి ఈ కేసు అయినా.. నిలుస్తుందా? అనేది ప్రశ్న. ఇక, టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారన్న ఫిర్యాదుతో మోహిత్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.