ఏపీలో వైసీపీఅధినేత జగన్ పేరు ఇప్పటికే ఎక్కడా వినిపించడం లేదు. వినిపించినా.. ఆయనకు వ్యతిరేకంగానే.. ఆయన పాలనపై వ్యతిరేకంగానే వినిపిస్తోంది. రాజకీయ నేతల నుంచి సామాజిక ఉద్యమకారుల వరకు కూడా.. జగన్‌ను విమర్శిస్తున్నవారే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరింతగా జగన్ పేరు మాయం కానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు పథకాలకు జగన్ పేరును, ఆయన గతంలో పెట్టిన పేరు(ఆయన పేరు కాకున్నా)ను మార్చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయాన్ని శనివారం అర్ధరాత్రి దాటాక మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఫలితంగా ఇక నుంచి ఆయా పథకాల పేర్లు మారనున్నాయి. కొన్నింటికి దేశ నాయకులు, మరికొన్నింటికి సమాజ సేవకుల పేర్లను పెట్టారు. అంతేకాదు.. వీటిలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించిన పేర్లు కూడా పెట్టడం గమనార్హం. దీంతో ప్పటి వరకు ఉన్న జగన్ పేర్లు, ఆయన ప్రకటించిన పేర్లు కూడా సమూలంగా మారిపోనున్నాయి. మొత్తంగా ఆరు పథకాల పేర్లను అధికారికంగా మారుస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ.. మార్పులు..
- జగనన్న అమ్మఒడి: తల్లికి వందనం- దీనిని ఎన్నికలకు ముందుగానే ప్రకటించారు. దీనిని ఇప్పుడు అధికారికం చేశారు.
- జగనన్న విద్యాకానుక: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర-జనసేన అధినేత సూచనల మేరకు మార్పు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ తొలి వైస్ చాన్సలర్‌గా పనిచేసిన రాధాకృష్ణన్ పేరును మార్పు చేశారు.
- జగనన్న గోరు ముద్ద : డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం- ఉభయ గోదావరి జిల్లా వాసులు అన్నపూర్ణగా కొలుచుకునే డొక్కా సీతమ్మగారి స్మృత్యర్థం.. గతంలోనే జనసేన.. ఈ పథకానికి పేరును సూచించింది. కానీ, అప్పట్లో జగన్ వినిపించుకోలేదు. ఇప్పుడు చిన్నారులకు మధ్యాహ్నం అందించే భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం గమనార్హం.
- మన బడి నాడు-నేడు : మనబడి- మన భవిష్యత్తు- దీనిని తాజాగా నిర్ణయించారు. ఇటీవల చంద్రబాబు ఆలోచన నుంచి వచ్చిన పేరు. విద్యార్థుల భవితవ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ పేరు సూచించారు.
- స్వేచ్ఛ : బాలికా రక్ష – దీనిని కూడా చంద్రబాబు మార్చారు. బాలికలకు శానిటరీ నేప్‌కిన్స్ ఇచ్చే పథకం
- జగనన్న ఆణిముత్యాలు : అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం – మిస్సైల్ మేన్, విద్యావేత్త అబ్దుల్ కలాం స్ఫూర్తిని భావితరాలకు అందించే ఉద్దేశంతో దీనిని తీసుకువచ్చారు.