ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, హత్యలకు పాల్పడుతుందని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీ వేదికగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఆరోపించాడు.
అయితే అనూహ్యంగా ఈ ధర్నాకు సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉద్దవ్ థాకరే), టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అన్నాడీఎంకే, జేఎంఎం, ఇండియన్ ముస్లిం లీగ్, వీసీకె పార్టీలు మద్దతు పలికాయి. గత ఐదేళ్లుగా జగన్ బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితంగానే మెలిగాడు. ఏపీలో ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా ఎక్కడా బీజేపీ పార్టీని, ఆ పార్టీ పెద్దలను, మోడీ, అమిత్ షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయలేదు. కేవలం కూటమి అంటూనే సంబోధించాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద కూడా జగన్ కానీ, వైసీపీ కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో జగన్ నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీలు మద్దతు పలకడం ఆసక్తికరంగా మారింది. లోక్ సభ ఎన్నికల్లో జగన్ ఇటు ఎన్డీఏ కూటమిలో గానీ, అటు ఇండియా కూటమిలో గానీ లేడు. అయినా ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మినహా ప్రధాన పార్టీలు అన్నీ జగన్ కు మద్దతుగా నిలిచాయి.
అయితే జగన్ సోదరి షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో వైసీపీ పాలన మీద విమర్శలతో పాటు, ఎన్నికల అనంతరం హింసపై ఢిల్లీలో జగన్ ధర్నా అంశంలో షర్మిల చేసిన విమర్శల మీద ఎక్కువ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో షర్మిలను కాదని కాంగ్రెస్ పార్టీ జగన్ ను ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తుందా ? అన్న చర్చ రాజకీయ వర్గాలలో మొదలయింది.
జగన్ కు లోక్ సభలో 4, రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉంది. తన మీద ఉన్న కేసుల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులలో జగన్ బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పోరాడతాడా ? ఇండియా కూటమిలో చేరతాడా ? అన్న ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. జాతీయ స్థాయిలో జగన్ కు బలమైన అండ అయితే కావాలి. కానీ బీజేపీ తరపు నుండి ఒక్కరు కూడా జగన్ ధర్నా వైపు తలెత్తి చూడలేదు.
ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోకి జగన్ ను ఆహ్వానిస్తారన్న సమాచారంతోనే షర్మిల అన్న జగన్ మీద విమర్శల డోసు పెంచిందని అంటున్నారు. అధికారం కోల్పోయేంత డ్యామేజ్ జరిగిన తర్వాత షర్మిలతో జగన్ రాజీ పడతాడని ఊహించలేమని, కానీ భవిష్యత్ అవసరాల నేపథ్యంలో కాంగ్రెస్ జగన్ ను చేరదీసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు జగన్ ఎలా వ్యవహరిస్తాడు అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.