జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. రఘురామకృష్ణరాజు(ఆర్.ఆర్.ఆర్) నుంచి చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని తెలిపారు. జగన్ ఆయనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టి పోలీసులతో కొట్టించినా.. అవేవీ మనసులో పెట్టుకోకుండా.. సభలో జగన్ కనిపించగానే వెళ్లి ఆప్యాయంగా పలకరించారని తెలిపారు. సభ్యులందరూ.. ఈ మంచి లక్షణాన్ని నేర్చుకోవాలని సూచించారు.
ఎవరూ కక్ష సాధింపులకు, అక్రమాలకు అన్యాయాలకు తావులేకుండా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. తాను తప్పు చేసినా.. ప్రశ్నించాలని, శిక్షించాలని అన్నారు. జనసేన నాయకులు తప్పులు చేసినా వదిలి పెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబువైపు చూస్తూ వ్యాఖ్యానించారు. అవినీతి అసలే చేయొద్దని చెప్పారు.
చంద్రబాబు వంటి అనుభవజ్ఞుల సమక్షంలో పనిచేయడం గర్వకారణమని తెలిపారు. ఆయన తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో పని చేస్తామని తెలిపారు.
రాష్ట్ర ఖజానా ప్రస్తుతం ఖాళీగా ఉందని పవన్ చెప్పారు. రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ఆగిపోయాయని తెలిపారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పెట్టుబడులు రాకుండా చేశారని, కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని పవన్ చెప్పారు. కాగా.. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం ఇస్తూ.. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు.
దీంతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. అయినా.. పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. పంచాయతీలకు నిధులు సక్రమంగా అందేలా సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates