ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, 31 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడులను తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని దేశం మొత్తానికి వివరిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా నెంబర్లు వివరించారు.
తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు35-36 మంది హత్యల్లో దారుణంగా చనిపోయారన్నది జగన్ చేసిన ఆరోపణ. వినుకొండలో జరిగిన దారుణ ఘటన తర్వాత.. ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ధర్నా కూడా చేస్తున్నారు. అయితే.. వాస్తవానికి గడిచిన 50 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్లోలం అయితే జరిగింది. అదేసమయంలో హత్యలు కూడా జరిగాయి. కానీ, ఇంతగా 35 మంది హత్యలకు గురయ్యాయా? అనేది ప్రశ్న.
ఈ విషయంపైనే రాజకీయాలు కూడా.. నడుస్తున్నాయి. అధికార పక్షం నుంచి నెంబర్ గేమ్‌కు ఫుల్ స్టాప్ పెట్టే చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి వంగలపూడి అనిత సహా సీనియర్ నేతలు ఈ నెంబర్లను తప్పుపడుతున్నారు. దీనికి తగిన ఆధారాలు ఉంటే ఇవ్వాలని కూడా చెబుతున్నారు. అయితే.. వైసీపీ నుంచి నెంబర్లు మాత్రం బయటకు రాలేదు. ఇక, ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకున్నారు.
జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని హోం శాఖ వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగాయని వివరించింది. మృతి చెందినవారిలో ముగ్గురు టీడీపీకి చెందినవారని, ఒకరు వైసీపీకి చెందినవారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఇక, పాతకక్షలు, రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్య జరిగినట్టు వెల్లడించింది. మృతులు ఇద్దరూ వైసీపీకి చెందినవారని పేర్కొంది. సో.. వాస్తవం ఇదేనని హోం శాఖ చెబుతుండగా.. వైసీపీ మాత్రం కాదు.. 35 మంది చనిపోయారని చెబుతుండడం గమనార్హం.