వి‘చిత్రం’.. జగన్ పక్కనే రఘురామ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన నాయకులకు ఏమాత్రం తగ్గని రీతిలో, ఇంకా చెప్పాలంటే వాళ్లను మించి ఆ పార్టీతో పోరాడిన, విమర్శలు గుప్పించిన నాయకుడిగా రఘురామకృష్ణంరాజుకు పేరుంది. వైసీపీ తరఫున ఏంపీగా గెలిచి, ఏడాది తిరక్కముందే రెబల్‌గా మారి నాలుగేళ్ల పాటు ఆ పార్టీతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు రఘురామ. దీంతో జగన్ కక్ష పూరితంగా ఆయన్ని అరెస్ట్ చేయించి చిత్రహింసలు పెట్టించారనే ఆరోపణ కూడా ఉంది.

ఇక ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన రఘురామ.. ఫలితాల అనంతరం కూడా వైసీపీని, జగన్‌ను వదిలిపెట్టట్లేదు. అసెంబ్లీ వేదికగా జగన్ మీద కౌంటర్లు వేశారు. బయట కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో జగన్‌ పక్కన రఘురామ కూర్చోవడం, ఆయనతో మాట్లాడ్డం అనేది ఊహకందని విషయం. ఈ రోజు అసెంబ్లీలో అదే జరిగింది. గవర్నర్ ప్రసంగం మీద నిరసన తెలపడానికి అసెంబ్లీకి వచ్చిన జగన్.. తన సీట్లో కూర్చోగా ఆయన్ని వెళ్లి రఘురామ పలకరించారు. అంతే కాక జగన్ పక్కన కూర్చున్నారు. ఆయన చెవిలో ఏదో చెప్పారు. ఐతే పాత విషయాలన్నీ మరిచిపోయి జగన్‌తో ఇకపై మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని రఘురామ అనుకుని ఆయనతో మామూలుగానే మాట్లాడారా.. లేక ఆయన్ని రాజకీయ ప్రత్యర్థిగానే భావించి ఏవైనా కౌంటర్లు వేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే.. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినప్పటికీ జగన్‌ వాహనాన్ని మరోసారి ప్రభుత్వం అసెంబ్లీ లోపలి వరకు అనుమతించడం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. జగన్ అయితే కచ్చితంగా ఇలా చేసేవాడు కాదని.. చంద్రబాబు కాబట్టి ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్‌ను గౌరవిస్తున్నాడని సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు.