స‌భా స‌మ‌రం: చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్‌…. ప‌థ‌కాల ఫైట్‌..!

ఏపీ అసెంబ్లీ సోమ‌వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో స‌భ‌లో కీల‌క‌మైన అంశం.. బ‌డ్జెట్. అది వ‌చ్చే మూడు మాసాల‌కు ప్ర‌క‌టిస్తారా? లేక‌.. వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు నిర్ణ‌యిస్తారా? అనేది చూడాలి. స‌రే.. ఏది ఎలా ఉన్నా.. ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారు ప్ర‌ధాన వ్యూహం.. వైసీపీకి కౌంట‌ర్ ఇవ్వ‌డ‌మే. భారీ ఎత్తున అలివిమాలిన‌ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించి.. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చారంటూ.. జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇప్ప‌టికీ ప‌థ‌కాల ఊసెత్త‌లేద‌న్నారు.

పేద ప్ర‌జ‌లు ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించిన ప‌థ‌కాల అమ‌లు కోసం ఎదురు చూస్తున్నార‌న్న జ‌గ‌న్.. వాటి అమ‌లు విష‌యాన్ని చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టి.. కేవ‌లం హ‌త్యారాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని.. వినుకొండ‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు చంద్ర‌బాబు అసెంబ్లీ వేదిక‌గా.. జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సూప‌ర్ 6 ప‌థ‌కాల్లో ఒక్క‌టి కూడా ప్రారంభం కాలేదు.

ఈ నేప‌థ్యంలో తాము ఆయా ప‌థ‌కాల‌ను ఎప్పుడు ప్రారంభించాలో.. ఎప్పుడు ప్రారంభించే అవ‌కాశం ఉం దో.. ప్ర‌స్తుతం ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉందో.. వంటి కీల‌క విష‌యాల‌ను చంద్ర‌బాబు ఏక‌రువు పెట్ట‌నున్నారు. ప‌థ‌కాల‌కు తాము ఖ‌ర్చు చేస్తోంది ఎంతో కూడా ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌నున్నారు. అదేవిధంగా గ‌త జ‌గ‌న్ స‌ర్కారు ఎంత మొత్తం ఖ‌ర్చు చేసిందో.. ఇప్పుడు ఎంతెంత పెండింగ్ ఉందో.. ఇలా.. అన్ని విష యాల‌ను చంద్ర‌బాబు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా స‌భ‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

ఇక‌, తాము ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల్లో ఇప్ప‌టికే 1న పింఛ‌న్ల పంపిణీ విజ‌యవంతం అయింద‌ని చంద్ర‌బాబు చెప్ప‌నున్నారు. ఇదేవిధంగా ఇత‌ర ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని అనుకున్నామ‌ని.. కానీ, ఖ‌జానాను ఖా ళీ చేశార‌ని.. అందుకే తాము కొంత స‌మ‌యం తీసుకున్నామ‌ని చెప్ప‌డం ద్వారా చంద్ర‌బాబు వ్యూహాత్మకం గా వైసీపీని ఇరుకున పెట్టే అవ‌కాశం ఉంది. ఎలా చూసుకున్నా.. వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే ప‌రిస్థితి అయితే క‌నిపిస్తోంది. ప‌థ‌కాల విషయంలో చంద్ర‌బాబు సంధించే ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న ఎలాంటి స‌మాధానం చెప్పాల‌న్నా.. మైకు దొరికే అవ‌కాశం కూడా లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.