విజయసాయిరెడ్డి.. ఎట్టకేలకు క్లారిటీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరు, రాజ్యసభ సభ్యుడు కూడా అయిన విజయసాయిరెడ్డి ఇటీవల ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసిన శాంతి అనే మహిళతో ఆయన బంధం గురించి రకరకాల ఆరోపణలు వచ్చాయి.

శాంతి భర్త అయిన మదన్ మోహన్.. తన బిడ్డకు తాను తండ్రిని కాదని.. విజయసాయిరెడ్డి లేదా సుభాష్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి అయి ఉంటారని.. దీని మీద విచారణ జరిపించాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.

ఈ విషయమై విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన గురించి వ్యతిరేక ప్రచారం చేస్తున్న మీడియా వాళ్ల మీద విరుచుకుపడ్డారు తప్ప శాంతితో తన బంధం గురించి పెద్దగా మాట్లాడలేదు. ఆరోపణలను నేరుగా ఖండించలేదు. ఆ ప్రెస్ మీట్ ప్రధానంగా తనకు వ్యతిరేకంగా కథనాలు ఇస్తూ, చర్చలు పెడుతున్న మీడియా వారిని తిట్టడానికే పరిమితమైంది.

దీంతో అసలు విషయం మాట్లాడకుండా మీడియా వాళ్లను తిడితే ప్రయోజనం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. శాంతితో తన బంధం గురించి ముందు విజయసాయిరెడ్డి క్లారిటీ ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఐతే ఎట్టకేలకు విజయసాయి ఆ పని చేశారు. ట్విట్టర్లో శాంతి గురించి ఒక పోస్ట్ పెట్టారు.

‘‘అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి లో కూడా చెప్తాను’’ అని విజయసాయి స్పష్టం చేశారు.