కాంగ్రెస్ పార్టీ అన్నంతనే ఒంటి కాలి మీద లేచేటోళ్లు చాలామందే కనిపిస్తారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఆ పార్టీ నేతల్ని అభివర్ణిస్తారు. అయితే.. అందరూ ఒకేలా ఉండరన్న దానికి తగ్గట్లు.. ఆ పార్టీకి చెందిన ఊమెన్ చాందీ నిలువెత్తు నిదర్శనంగా చెబుతారు. కేరళ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపంగా అభివర్ణిస్తుంటారు.
ఆయనకు సంబంధించి మరో ఆసక్తికరమైన రికార్డు ఉంది. ప్రజాజీవితంలో యాభై ఏళ్లకు పైగా పూర్తి చేసుకున్న ఊమెన్ చాందీ ఒకే నియోజకవర్గం నుంచి ఓటమి అన్నది లేకుండా పదకొండు సార్లు నాన్ స్టాప్ గా గెలుస్తూనే ఉన్నారు. కొట్టాయం జిల్లా పూతుప్పల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తాజాగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా తన గెలుపు సీక్రెట్ ను కొన్ని మీడియా సంస్థలతో షేర్ చేసుకున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి గెలవటమే గ్రేట్ అనుకుంటూ జబ్బలు చరుచుకునే పరిస్థితి. అలాంటి యాభై ఏళ్లుగా ఒకే నియోజకవర్గం నుంచి ఓటమి అన్నది తెలీని రీతిలో ఆయన రాజకీయాల్లో రాణిస్తున్నారన్న విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు 26 ఏళ్ల వయసులో కాంగ్రెస్ అభ్యర్థిగా పూతుప్పల్లిలో తాను పోటీ చేశానని చెప్పారు. తాను ఏ స్థానంలో ఉన్నా..తన నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గాన్ని విడిచి రావటం తనకు ఇష్టం ఉండదన్నారు.
ఇందులో భాగంగా తాను ఏ హోదాలో ఉన్నా కూడా.. శనివారం రాత్రికి తాను ప్రాతినిధ్యం వహించే పూతుప్పల్లి నియోజకవర్గానికి చేరుకుంటానని చెప్పారు. ఆదివారం తన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని.. వారి సమస్యల పరిష్కారానికి సంబంధించిన పనులతో పాటు.. డెవలప్ మెంట్ యాక్టివిటీస్ అన్ని ఆ సమయంలోనే తేల్చేస్తానని చెప్పారు. చివరకు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ.. ఆదివారం అయితే చాలు.. తన నియోజకవర్గానికి వెళుతుండేవాడినని.. అంతలా తన నియోజకవర్గ ప్రజలతో తనకు అనుబంధం ఉందన్నారు.
పూతుప్పల్లి ప్రజలతో తనకున్న అనుబంధం భిన్నమైనదని.. అదే వారితో తనకు శాశ్వితమైన అనుబంధం కలిగేలా చేసిందన్నారు. నియోజకవర్గంలోని ఏ కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమానికైనా తనను పిలిస్తే.. తాను తప్పనిసరిగా వెళతానని.. ఒకవేళ వెళ్లటం కుదరకపోతే.. లేఖ రాస్తానని చెప్పారు. అదే తనను ఓటమి ఎరుగనివ్వని పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్పారు.