పుంగనూరులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిన నేపథ్యంలో రెడ్డప్ప, మిథున్ రెడ్డిలకు వ్యతిరేకంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రెడ్డప్ప నివాసం దగ్గరకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో రెడ్డప్ప, మిథున్ రెడ్డి వేధింపులకు గురి చేశారంటూ ఆయన పర్యటనకు నిరసనగా టిడిపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. గోబ్యాక్ మిథున్ రెడ్డి అని నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసేందుకు భారీగా బలగాలని మోహరించారు. పుంగనూరులో హై టెన్షన్ వాతావరణ ఏర్పడిన నేపథ్యంలో మిథున్ రెడ్డిని రెడ్డప్ప నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఎంపీ రెడ్డప్ప టార్గెట్ గా టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగడంతో అదే సమయంలో అక్కడికి వెళ్లిన మిథున్ రెడ్డి కూడా ఈ నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది.
రెడ్డప్పతోపాటు మిథున్ రెడ్డిపై కూడా వేధింపులకు గురిచేశారని ఆరోపణలు ఉండటంతో ఒకసారి టిడిపి కార్యకర్తలు ఆ ఇద్దరిని లక్ష్యంగా చేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలో మిథున్ రెడ్డి వాహనం ధ్వంసం అయింది. కాసేపు పోలీసులు పరిస్థితిని అదుపు చేసినప్పటికీ ఆ తర్వాత మరికాసేపటికి మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇక, మిథున్ రెడ్డి పై దాడి ఘటనను తిరుపతి ఎంపీ గురుమూర్తి ఖండించారు. ఎంపీకి రక్షణ కల్పించలేని ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏం రక్షణ కల్పిస్తుందని గురుమూర్తి ప్రశ్నించారు. ఎంపీపై, ఆయన వాహనంపై రాళ్ల దాడి జరుగుతుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారని ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోంది అనేందుకు ఇది నిదర్శనమని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని ఎన్డీఏ పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.