వైసీపీకి ఇంత డ్యామేజీకి వెంక‌ట‌రెడ్డే కార‌ణ‌మా..!

వైసీపీ అధికారం కోల్పోయింది. అయితే.. ఇది సాధార‌ణంగా జ‌రిగింది కాదు.. అత్యంత దారుణంగా అధికారం కోల్పోయింది. ఎక్క‌డి 151.. ఎక్క‌డి 11. ఈ స్థాయిలో వైసీపీ దారుణంగా ప‌రాజ‌యం పొంద‌డానికి కార‌ణ‌మేంటి? ఎందుకు ఇంత‌లా ప్ర‌జ‌లు ఆ పార్టీని ఛీకొట్టార‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది. అయితే.. దీనికంటే ఎక్కువ‌గా గ‌నుల శాఖ డైరెక్ట‌ర్‌గా వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకుని మ‌రీ నియ‌మించుకున్న వెంక‌ట‌రెడ్డి.. స‌ర్కారు కుప్ప‌కూలిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

“ఆయ‌న‌నే న‌మ్ముకున్నారు. ఆయ‌న ఎంత చెబితే అదే చేశారు. మా మాట కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. రైతుల‌కు ఇచ్చే పాస్ పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫొటోలు వ‌ద్ద‌ని చెప్పాం. స‌ర్వే రాళ్ల‌పై ఆయ‌న ఫొటోలు చెక్కించ‌ద్ద‌ని కూడా..చెప్పాం. అయినా మాట విన‌లేదు. జ‌గ‌న్‌తో పాటు మేమంతా మునిగిపోయాం” అని మాజీ ఎమ్మెల్యే కాట‌సాని వ్యాఖ్య‌లు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఆ దిశ‌గానే వైసీపీ అంత‌ర్మ‌థ‌నం చేస్తోంది. దీనిలో అప్ప‌టి డైరెక్ట‌ర్‌గా ఉన్న వెంక‌ట‌రెడ్డి చుట్టూ.. తిరిగిన నిర్ణ‌యాలు.. ఆయ‌న ఇచ్చిన స‌ల‌హాల‌పై వైసీపీ లోతుగా ప‌రిశీలిస్తోంది.

గ‌నుల శాఖ డైరెక్ట‌ర్‌గా ఉన్న వెంక‌ట రెడ్డి అన్నీ తానై.. ఇసుక‌, గ‌నుల వ్య‌వ‌హారాల‌ను చ‌క్క బెట్టారు. అదేవిధంగా రైతుల‌కు ఇచ్చే పాస్ పుస్త‌కాల‌పై జ‌గ‌న్ బొమ్మ‌లు వేయించ‌డంలోనూ.. భూముల రీ స‌ర్వే చేసిన త‌ర్వాత‌ స‌రిహ‌ద్దు రాళ్ల‌పై జ‌గ‌న్ బొమ్మ వేయాల‌ని కూడా ఆయ‌నే సూచించారు. ఇది క్షేత్ర‌స్థాయిలో పార్టీపైనా.. ముఖ్యంగా జ‌గ‌న్‌కు ఉన్న ఇమేజ్‌ను కూడా.. దారుణంగా దెబ్బ‌తీసింది. ఇక‌, భూముల విష‌యంలో ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం ఏర్ప‌డి.. మీ భూములు మీవి కాకుండా పోతాయ‌ని అప్ప‌టి ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసినా.. వెంక‌ట రెడ్డి జోక్యం చేసుకుని లైట్ తీసుకోవాల‌ని చెప్పార‌ని పార్టీ నేత‌లు అంటున్నారు.

వెంక‌ట‌రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం.. దీనికి జ‌గ‌న్ తలూప‌డం.. కార‌ణంగా పార్టీ స‌హా.. నాయ‌కులు మొత్తంగా ప్ర‌జాగ్ర‌హ జ్వాల‌ల్లో కాలిపోయార‌ని అంటున్నారు. స‌హ‌జంగా భూములు ఆస్తుల విష‌యంలో ప్ర‌జ‌లు సీరియ‌స్‌గా ఉంటారు. అలాంటిది విష‌యంలో జ‌గ‌న్ వేలు పెట్టేలా చేసి.. 350 కోట్ల‌తో స‌రిహ‌ద్దు రాళ్ల‌కు టెండ‌ర్ ఇప్పించింది వెంక‌ట‌రెడ్డే. దీనిలో సీఎం జ‌గ‌న్ ప్ర‌మేయం కానీ.. ఇత‌ర అధికారుల ప్ర‌మేయం కాలేదు. దీనిలో వెంక‌ట రెడ్డి రూ.100 కోట్ల వ‌ర‌కు మెక్కేసేందుకు ప్లాన్ వేసి.. త‌న అవినీతి దాహం కోసం.. పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టించార‌నే ఆగ్ర‌హం ఇప్పుడు వైసీపీ నాయ‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ కార‌ణంగానే గ్రామీణ స్థాయిలో ప‌దిలంగా ఉన్న వైసీపీ ఓటు బ్యాంకు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింద‌ని అంటున్నారు. అయితే.. ఇప్పుడు చేసేందుకు ఏమీ లేక‌పోవ‌డం.. మున్ముందు ప‌రిస్థితిని బ‌ట్టి ముందుకు సాగ‌డం వంటివి మాత్ర‌మే వైసీపీ ముందున్న క‌ర్త‌వ్యాలుగా చెబుతున్నారు.