జ‌గ‌న్‌ సైలన్స్ పార్టీ కి చేటు

పెద్ద‌రికం ఒక‌రు ఇస్తే వ‌చ్చేది కాదు.. త‌న‌కు తానుగా పెంచుకునేది.. త‌న‌కు తానుగా పాటించేది. ఈ విషయంలో పార్టీల అధినేతలు వ్య‌వ‌హ‌రించే తీరును బ‌ట్టే పార్టీ మ‌నుగ‌డ ఆధార‌ప‌డి ఉంటుంది. తెలంగాణ పెద్ద‌రికంగా వ్య‌వ‌హ‌రించిన‌.. కేసీఆర్‌.. మితిమీరిన పెద్ద‌రికం చూపించ‌డంతో అభాసుపాల‌య్యారు. సొంత పార్టీ నేత‌లే ఆయ‌న‌కు దూర‌మ‌య్యే ప‌రిస్థితిని కొని తెచ్చుకున్నారు. పెద్ద‌రికాన్ని ఎక్క‌డ ఎలా వాడుకోవా లో తెలిసి ఉండ‌డం కూడా ఒక క‌ళ‌. ఈ విష‌యంలో ఇత‌ర నాయ‌కుల‌తో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్ర‌బాబు భేష్ అని అనిపించారు.

ఎక్క‌డ ఎలా మాట్లాడాలో.. ఏవిష‌యంపై ఎలా స్పందించాలో చంద్ర‌బాబు కు బాగా తెలుసు. అందుకే సుదీర్ఘ కాలంగా ఆయ‌న పార్టీని అనేక ఒడిదుడుకులు ఎదురైనా నెట్టుకువ‌స్తున్నారు. అధికారంలోకి తీసుకువ‌స్తున్నారు. ఈ విజ్ఞ‌త కొర‌వ‌డిందో ఏమో.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం.. జ‌గ‌న్ త‌న పెద్దరికాన్ని తానే పాడే చేసుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితి ముదిరితే.. మున్ముందు.. ఆయ‌న తెచ్చి పెట్టుకుందామ‌న్నా.. పెద్ద‌రికం నిల‌వ‌దు. ఇప్పుడు కేసీఆర్‌కు ఎలాంటి ప‌రిస్థితివ‌స్తుందో అదే వ‌స్తుంది.

ఏం జ‌రిగింది..

రాష్ట్రంలో గ‌త నాలుగు రోజులుగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యులు వి. విజ‌య‌సాయిరెడ్డి కేంద్రంగా దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతి వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. ఆమెకు పుట్టిన బిడ్డ విష‌యంపై చెలరేగిన వివాదంపై స్పందించిన సాయిరెడ్డి మీడియాపైనా త‌న అక్క‌సు వెళ్ల గ‌క్కారు. ఇక‌, శాంతి త‌న వాద‌న తాను వినిపించింది. విష‌యంలో నేరుగా జ‌గ‌న్ జోక్యం చేసుకున్నా.. చేసుకోక‌పోయినా.. సాయిరెడ్డి మీడియాపై చేసిన వ్యాఖ్య‌ల‌పై అయినా.. ఆయ‌న స్పందించాల్సి ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. కానీ.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.

పార్టీలో సీనియ‌ర్ నాయ‌కులు బాలినేని శ్రీనివాస‌రెడ్డి- మ‌రో నేత చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి మ‌ధ్య కోల్డ్ వార్ రోడ్డు న ప‌డింది. ఇది ఎటు మ‌లుపు తిరుగుతుందో కూడా తెలియ‌దు. ఇది సొంత పార్టీ వ్య‌వ‌హార‌మే అయినా.. జ‌గ‌న్ ఇప్పుడు జోక్యం చేసుకోక‌పోతే.. రేపు ఆయ‌న గుట్టుమట్లు కూడా బ‌య‌ట‌కు పొక్కే ప్ర‌మాదం ఉంది. అయినా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రాష్ట్రంలో గ‌డిచిన వారం రోజుల్లో అనేక చోట్ల చిన్న పిల్ల‌ల‌పై అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా.. జ‌గ‌న్ ఆయా ఘ‌ట‌న‌ల‌ను ఘండించ‌డమో.. బాధితుల‌కు అండ‌గా ఉండ‌డమో చేయాలి. కానీ, ఎన్నిక‌ల్లో న‌న్ను ఓడించారు కాబ‌ట్టి.. మీచావు మీరు చావండి అన్న‌ట్టుగా వ‌దిలేశారు. ఇలా.. అనేక విష‌యాల్లో ఆయ‌న స్పందించ‌కుండా.. మౌనంగా ఉండ‌డం.. పెద్ద‌రికాన్ని ప్రభావితం చేస్తోంది. ఇప్ప‌టికే వైసీపీపై ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త పోయింది. ఇది మ‌రింత పోతే.. మ‌రో క‌మ్యూనిస్టు పార్టీగా మిగిలిపోయినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.