ఢిల్లీలో గృహప్రవేశం చేస్తున్న చంద్రబాబు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సంధర్భంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు 2015లో ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు బస చేసేందుకు 1 జనపథ్ లో అధికారిక నివాసాన్ని కేటాయించింది. అయితే చంద్రబాబు మాత్రం అప్పట్లో అందులో ఉండేందుకు ఇష్టపడలేదు. అయితే తాజాగా ఇక నుండి అందులో ఉండాలని భావించి బుధవారం నాడు 1 జనపథ్ నివాసంలో అడుగుపెట్టనున్నారు.

2014 – 2019 మధ్య కాలంలో ఈ నివాసంలో సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్ల కోసం ఏపీ ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. కానీ అప్పట్లో ఎందుకో ఇక్కడ బస చేసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపేవారు కాదు. ఈ నివాసం పక్కనే నంబర్ 2 జనపథ్ లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నివాసం ఉండేవారు. ఈ నేపథ్యంలో అనవసరమైన రాజకీయ విమర్శలకు తావు ఇవ్వకూడదనే అక్కడ ఉండేవారు కాదని చెబుతారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పుడైనా వస్తే అక్కడ ఉండేవారు. 2019లో టీడీపీ ఓటమి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో జగన్ బస చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు ఏపీ భవన్ లోనే ఉండేవారు. తెలంగాణ – ఆంధ్ర విభజన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు ఉండడానికి అక్కడ సదుపాయాలు కల్పించారు. వాస్తు రీత్యా కొన్ని మార్పులు కూడా చేశారు.

అయితే ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఎప్పుడు వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలోనే ఉంటున్నారు. ఆయన అశోకా రోడ్డులోని క్వార్టర్ నంబర్ 50లో ఉంటున్నారు. గతంలో ఇక్కడ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఉండేవారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోవడంతో దీనిని రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటున్నారు. ఇక ఎట్టకేలకు 1 జనపథ్ లో ఉండాలని చంద్రబాబు నిర్ణయించడంతో బుధవారం అక్కడ పూజలకు ఏర్పాట్లు చేశారు.