ఏపీలోని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గ బృందం విపక్ష నేత జగన్ కు భారీ ఇచ్చింది. గతంలో ఆయన ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో తొలి అజెండా అంశంగా.. దీనిని ఉంచారు. దీనికి కేబినెట్ ఏకగ్రీ వంగా ఆమోదం తెలిపింది. ఈ చట్టాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనేరద్దు చేస్తామని.. ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. మలి సంతకం కూడా దీనిపైనే చేస్తానని చెప్పారు.
అన్నట్టుగానే మూడో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైనే చేశారు. ఇక, ఇప్పుడు మంత్రి వర్గంలో నూ చర్చించి.. దీనిని రద్దు చేశారు. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టం రద్దుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించడంతో పూర్తిగా ఈ చట్టం కనుమరుగు కానుంది. అయితే.. ఈ చట్టం కింద ఇప్పటికే 20 వేల మందికి పట్టాలు ఇచ్చారు. వాటిని కూడా రద్దు చేసి సమీక్షించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు.
ఇక, ఉచిత ఇసుకను పూర్తిస్థాయిలో ఆమోదిస్తూ.. మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 20 జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని మున్ముందు.. అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితిలోనూ వేళ్లు పెట్టొద్దనే విధానానికి కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అక్టోబరు నుంచి మరింతగా ఇసుక అందుబాటులోకి వస్తుందని, అప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని మంత్రి మండలి తీర్మానించింది.
ఇక, పౌరసరఫరాల శాఖకు 2 వేల కోట్లు అప్పు రూపంలో తెల్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన గతంలో జగన్ సర్కారు చేసిందే అయినా.. ఇప్పుడు దీనిని అనుసరించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి వర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, మంత్రులు ఎవరూ వివాదాల జోలికి పోకూడదని చంద్రబాబు ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు.